
బంగారానికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ముఖ్యంగా మన దేశంలో బంగారం సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ధరలు ఎలా ఉన్నా కొనేవాళ్లు కొంటూనే ఉంటారు. కొందరు బంగారాన్ని ఆస్తులుగా భావించి వారసత్వ సంపదగా గౌరవిస్తారు. భారతీయ వేడుకల్లో దాదాపు ప్రతి దాంట్లో బంగారు బహుమతులు ఇస్తుంటారు. అలాగే దేవాలయాల్లో విరాళంగానూ పసిడి ఇస్తుంటారు. అంతేకాదు.. బంగారం తమ హోదాను చూపిస్తుంది అనుకుంటారు చాలామంది. ఇన్ని రకాలుగా గోల్డ్‌కి ప్రాధాన్యత ఉంది. అందుకే గోల్డ్ విషయంలో అస్సలు తగ్గరు.
ఈ దీపావళికి తులం బంగారం ధర దాదాపు రూ.లక్షా ముప్పైవేలు దాటినా పసిడి ప్రియులు మాత్రం భారీగా కొనుగోళ్లు చేశారు. అందుకు కారణం ధన త్రయోదశి (ధంతేరాస్) రోజు బంగారం కొనడం భారతీయ సంప్రదాయం. ఆరోజు బంగారం కొంటే ఏడాదంతా సంపద వస్తుందని నమ్మకం. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో ధన్వంతరి భగవానుడు అమృత కలశంతో అవతరించాడని, ధనత్రయోదశి రోజు అంటారు.
క్యారెట్ ఎంతైనా.. స్వచ్ఛతకు హాల్‌మార్క్
బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్లు ఉంటే స్వచ్ఛమైన బంగారం. ఇందులో 99.99 శాతం బంగారం ఉంటుంది. దీన్ని ఇన్వెస్టర్లు ఎక్కువగా కొంటుంటారు. తర్వాత 22 క్యారెట్ల బంగారం.. ఇందులో 91.6 శాతం స్వచ్ఛత ఉంటుంది. మిగతా 8 శాతం ఇతర లోహాలు కలిసి ఉంటాయి. దీంతో మనదేశంలో ఎక్కువగా నగలు చేయించుకుంటారు.18 క్యారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలు కలుపుతారు. అయితే కస్టమర్ల ఇష్టాఇష్టాలను బట్టి బంగారాన్ని కొంటుంటారు.
14 క్యారెట్ల బంగారంలో 58 శాతం బంగారం, 42 శాతం ఇతర లోహాలు ఉంటాయి. ఇందులో ఏ రకం కొన్నా అవి బంగారు నగలే. వాటిలో ఉండే బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు హాల్ మార్క్ కూడా ఉంటుంది. ప్రస్తుతం 9 క్యారెట్ల బంగారం ట్రెండింగ్‌లో ఉంది. 9 క్యారెట్ల బంగారంలో కేవలం వేలల్లోనే నచ్చిన నగలు కొనుక్కోవచ్చు. ఇందులో 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.
మిగతా 62.5 శాతం ఇతర లోహాలు ఉంటాయి. పది గ్రాముల 9 క్యారెట్ల బంగారం 30 నుంచి 40 వేల రూపాయల మధ్యలో ఉంటుంది. అంతేకాదు.. ఈ ఏడాది జులై నుంచి 9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్క్ తప్పనిసరి చేసినట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బిఐఎస్) ప్రకటించింది. ఈ హాల్ మార్క్ బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. కాబట్టి 9 క్యారెట్ల బంగారాన్ని హాల్ మార్క్ చూసి కొనొచ్చు.
రంగు రంగుల్లో
పచ్చగా ఉంటేనే బంగారం అనుకుంటే పొరపాటేనా? అవును.. ఎందుకంటే బంగారం కూడా రంగు రంగుల్లో దొరుకుతుంది. అదెలాగంటే.. బంగారు నగలు తయారుచేసేటప్పుడు అందులో ఇతర లోహాలు కలుపుతుంటారు. ఏ లోహం ఎక్కువ కలిస్తే నగ ఆ రంగులో కనిపిస్తుంటుంది. ఆ విధంగా బంగారంలో కొన్ని రంగులు ఉన్నాయి. వాటిలో మొదటగా ఎల్లో గోల్డ్. స్వచ్ఛమైన బంగారానికి వెండి, రాగి, జింక్ లాంటివి కలుపుతారు. మనదగ్గర ఎక్కువగా ఇష్టపడేది ఈ బంగారాన్నే. దీంతో నగలే కాదు.. నాణేలు కూడా ఎక్కువగా తయారుచేస్తుంటారు.
అలాగే వైట్ గోల్డ్.. ఇందులో బంగారంలో ప్లాటినం, కొద్దిగా నికెల్, జింక్ లోహాలు కలుపుతారు. దాంతో అది తెల్లగా కనిపిస్తుంది. పచ్చ బంగారంతో పోలిస్తే వైట్ గోల్డ్ మన్నికైనది. దీన్ని డైమండ్ జ్యువెలరీలో ఎక్కువగా వాడతారు. ఇకపోతే రోజ్ గోల్డ్.. దీన్నే పింక్ గోల్డ్ అంటుంటారు. ఇందులో వెండి, రాగి కలుపుతారు. ఇందులో తక్కువ ధరకు దొరికే రాగిని కలిపినా మన్నిక ఎక్కువే. ఇవన్నీ తెలిసే ఉంటాయి. కానీ, గ్రీన్ గోల్డ్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీన్ని ఎలెక్ట్రమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని క్రీ.పూ 860 ఏండ్ల నాటికే వాడడం మొదలుపెట్టారు.
బంగారంలో వెండి కలపడం వల్ల ఆకుపచ్చ, పసుపు రంగులు కలిసినట్టు కనిపిస్తుంది. కొన్నిసార్లు రాగి కూడా కొంచెం కలుపుతారు. ఆకుపచ్చగా కనపడేందుకు ఇందులో కాడ్మియం కలుపుతారు. కానీ ఇది చాలా డేంజర్. అందుకని ముదురు ఆకుపచ్చ రంగు రావాలన్నప్పుడే దీన్ని కొద్దిమొత్తంలో కలుపుతారు. ఇవే కాదు.. ఇంకా గ్రే గోల్డ్, స్పాంగోల్డ్, పర్పుల్ గోల్డ్, బ్లూ గోల్డ్, బ్లాక్ గోల్డ్.. ఇలా ఉన్నాయి.
పెట్టుబడిగా పసిడి
బంగారం పెట్టుబడిగా పనికొస్తుంది. గతంలో అయితే బంగారం ఫిజికల్‌గా కొని దాచుకునేవాళ్లు. ఇప్పుడు మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్.. ఇలా ఎన్నో రకాల ఆప్షన్లు ఉన్నాయి. దేనిపై పెట్టుబడి పెడితే లాభం వస్తుందో తెలుసుకోవాలి.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015లో సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చింది. ఏడాదికి 2.5 శాతం వడ్డీతో ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఏడాదికి రెండుసార్లు వడ్డీ జమ అవుతుంది. ఇందులో ఒక ఫ్యామిలీ గ్రాము నుంచి 4 కేజీల వరకు, ట్రస్ట్‌లు 20 కేజీల వరకు కొనొచ్చు.
- ఈటీఎఫ్ అంటే ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. మార్కెట్ ధర ప్రకారం అమ్మడం, కొనడం జరుగుతాయి.
- గోల్డ్ ఫండ్స్.. ఇందులో సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్(సిప్)కు అవకాశం ఉంటుంది. మినిమమ్ 500రూపాయలతో పెట్టుబడి పెట్టొచ్చు.
- డిజిటల్ గోల్డ్‌కు 99.9శాతం స్వచ్ఛమైన గోల్డ్‌కు సమానమైన విలువ ఉంటుంది.
ఎందుకు పెరుగుతోంది?
బంగారం ధర పెరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మొదటగా మన దేశంలో పంటలు బాగా పండితే బంగారం అమ్మకాలు పెరుగుతాయి. కరువొస్తే పంట నష్టం వల్ల బంగారం డిమాండ్ తగ్గి ధర తగ్గుతుంది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ఇండెక్స్ పనితీరు మెరుగ్గా లేకపోతే ధర పెరుగుతుంది. దేశ జీడీపీ వృద్ధి రేటు పెరిగినా డిమాండ్ పెరుగుతుంది.
సెంట్రల్ బ్యాంక్‌లు డాలర్ విలువ తగ్గితే పేపర్ కరెన్సీని బంగారంగా మార్చేస్తాయి. కాబట్టి డాలర్లతో బంగారం కొని నిల్వ చేస్తే ధర పెరుగుతుంది. అమెరిక్ డాలర్ విలువ తగ్గితే గోల్డ్ ధర పెరుగుతుంది.