చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్..రాజస్థాన్​లో బీజేపీ

చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్..రాజస్థాన్​లో బీజేపీ
  • టైమ్స్ నౌ‑ ఈటీజీ సర్వేలో వెల్లడి  

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు సాగనుందని.. అయితే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కే అవకాశాలు ఉన్నాయని టైమ్స్ నౌ–ఈటీజీ ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది. రాజస్థాన్​లో మాత్రం కాంగ్రెస్ నుంచి పవర్​ను బీజేపీ కైవసం చేసుకోనుందని తేలింది. ఇక చత్తీస్ గఢ్​లో కాంగ్రెస్​కు తిరుగులేదని, అక్కడి ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ సర్కార్ కే జైకొట్టనున్నారని సర్వే వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఓటర్ల తీర్పు పై టైమ్స్ నౌ చానెల్ ఒపీనియన్ పోల్ ఫలితాలను విడుదల చేసింది. 

రాజస్థాన్.. బీజేపీకే పవర్ 

రాజస్థాన్​లో మొత్తం 21,136 మందిపై సర్వే నిర్వహించారు. వీరిలో 30% మందిని టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. మిగతా 70% మందిని డోర్ టు డోర్ కలిసి సమాచారం సేకరించారు. రాష్ట్ర అసెంబ్లీలోమొత్తం 200 సీట్లు ఉండగా.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 101ని సునాయాసంగా దాటి 114 నుంచి 124 సీట్లను గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న  కాంగ్రెస్ 68 నుంచి 78 సీట్లకే పరిమితం కానుందని వెల్లడించింది.

చత్తీస్ గఢ్.. కాంగ్రెస్ దే హవా 

చత్తీస్ గఢ్ లో 18,243 మందిపై సర్వే నిర్వహించారు. వీరిలో 60% మందిని టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. మిగతా 40% మందిని డోర్ టు డోర్ కలిసి ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. మ్యాజిక్ ఫిగర్ 46 కంటే అధికంగా 51 నుంచి 59 సీట్లను గెలుచుకుంటుందని వెల్లడించింది. బీజేపీ 27 నుంచి 35 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది.  

మధ్యప్రదేశ్.. హోరాహోరి 

మధ్యప్రదేశ్​లో 25,793 మందిపై సర్వే చేశారు. వీరిలో 30% మందిని టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా, మిగతా 70% మందిని డోర్ టు డోర్ సర్వే ద్వారా ప్రశ్నించారు. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు సాగనుందని సర్వే తేల్చింది. అయితే, బీజేపీని ఓడించి కాంగ్రెస్ గద్దెనెక్కే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేసింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 116ను దాటి 122 వరకూ సీట్లను గెలుచుకోనుందని అంచనా వేసింది. బీజేపీ 107 నుంచి 115 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది.