టిమ్స్ కాంట్రాక్ట్ సిబ్బందికి వెయిటేజీ!..రెగ్యులర్ రిక్రూట్మెంట్‌‌ లో మార్కులు కలిపే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం  

టిమ్స్ కాంట్రాక్ట్ సిబ్బందికి వెయిటేజీ!..రెగ్యులర్ రిక్రూట్మెంట్‌‌ లో మార్కులు కలిపే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం  
  • డీఎస్సీ ద్వారా డాక్టర్లు, నర్స్​లు, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని  సనత్ నగర్‌‌‌‌లో నిర్మించిన తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటల్‌‌ను పూర్తిస్థాయిలో పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే మౌలిక వసతులు సిద్ధం కావడంతో.. ఇప్పుడు సిబ్బంది భర్తీపై ఫోకస్ పెట్టింది. ఈ హాస్పిటల్‌‌లో  కాంట్రాక్ట్ పద్ధతిలో చేరబోయే వైద్య సిబ్బందికి భవిష్యత్తులో నిర్వహించే రెగ్యులర్ రిక్రూట్‌‌మెంట్‌‌లో వెయిటేజీ మార్కులు ఇచ్చే నిర్ణయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా నిపుణులైన డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్​ను ఆకర్షించడమే కాకుండా, సేవలందిస్తున్న వారికి ఉద్యోగ భరోసా కల్పించాలని భావిస్తోంది. డీఎస్సీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీకి సర్వం సిద్ధం చేస్తున్నది. 

నిమ్స్ చేతికి అడ్మినిస్ట్రేషన్ రిక్రూట్​మెంట్.. 

టిమ్స్ హాస్పిటల్ పరిపాలనను అత్యున్నత ప్రమాణాలతో నడిపించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ భర్తీ బాధ్యతలను ప్రభుత్వం నిమ్స్ హాస్పిటల్ కు అప్పగించింది. మరోవైపు డాక్టర్లు, నర్స్​లు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఎంపిక ప్రక్రియను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కేవలం తాత్కాలిక సిబ్బందితోనే ఆగిపోకుండా, వీలైనంత త్వరగా రెగ్యులర్ రిక్రూట్ మెంట్ నిర్వహించి హాస్పిటల్ ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఈ ప్రక్రియలో భాగంగా కాంట్రాక్ట్ సిబ్బందికి ఇచ్చే వెయిటేజీ మార్కులు రిక్రూట్ మెంట్ లో కీలకం కానున్నాయి. కాగా, టిమ్స్ కోసం ప్రభుత్వం ఇప్పటికే 450 మంది సిబ్బందిని డిప్యూటేషన్ పై తీసుకుంది. ఇటీవలే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, చెస్ట్ హాస్పిటల్ వంటి హాస్పిటల్స్ నుంచి మరో 180 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లను డిప్యూట్ చేశారు.

ఖాళీలపై కసరత్తు చేస్తున్న అధికారులు 

హాస్పిటల్ అవసరాల దృష్ట్యా గత మే నెలలోనే ఫైనాన్స్ శాఖ ద్వారా 1,142 రెగ్యులర్ పోస్టులను వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి టిమ్స్ సనత్ నగర్‌‌‌‌కు రీ-డిప్లాయ్ మెంట్ చేసింది. ఈ పోస్టుల్లో ప్రస్తుతం సర్వీసులో ఉన్న పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు ఆఫీస్ సూపరింటెండెంట్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. రీ-డిప్లాయ్ మెంట్ చేసిన పోస్టుల్లో ఖాళీగా ఉన్న వాటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇప్పటికే వివిధ హాస్పిటల్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన సిబ్బంది సంఖ్యను పరిగణనలోకి తీసుకుని, కచ్చితంగా ఎన్ని ఖాళీలను భర్తీ చేయాలనే దానిపై వైద్య ఆరోగ్య శాఖ తుది నివేదికను సిద్ధం చేస్తోంది. పూర్తిస్థాయిలో సిబ్బంది నియమితులైతే త్వరలోనే టిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి రానున్నది