- ఒక్కో టిమ్మ్లో రెండు నుంచి మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు
- వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతున్న హెల్త్ డిపార్ట్మెంట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నలువైపులా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రులను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 'మల్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లుగా తీర్చిదిద్దేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. కేవలం ఒకే ఒక విభాగానికి పరిమితం కాకుండా, ప్రతి టిమ్స్ హాస్పిటల్‌లో రెండు నుంచి మూడు అత్యున్నత సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నది.
ఈ ప్లాన్ ప్రకారం.. సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రధానంగా గుండె జబ్బులు, అవయవ మార్పిడి (కార్డియాక్ సైన్సెస్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్) కేంద్రంగా మారుస్తూ, దానికి అనుబంధంగా కిడ్నీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ విభాగాలను బలోపేతం చేయనున్నారు. అలాగే, అల్వాల్ టిమ్స్‌ను న్యూరో సైన్సెస్ (మెదడు, నరాలు) విభాగానికి కేటాయించి, అక్కడ న్యూరో సర్జరీతో పాటు స్పైన్ సర్జరీ, న్యూరో రిహాబిలిటేషన్ సేవలను అందించనున్నారు. ఇక కొత్తపేట టిమ్స్‌ను గ్యాస్ట్రో సైన్సెస్ (జీర్ణకోశ వ్యాధులు) హబ్‌గా మారుస్తూ, దానికి తోడుగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాలేయ సంబంధిత (హెపటాలజీ) విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
రిలేటెడ్ వైద్యం ఒకే దగ్గర
ఇలా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వైద్య విభాగాలను ఒకే చోట చేర్చడం వల్ల రోగులకు పూర్తిస్థాయి చికిత్స ఒకే ఆసుపత్రిలో లభిస్తుంది. ఉదాహరణకు.. గుండె జబ్బులు ఉన్న రోగికి కిడ్నీ సమస్యలు కూడా వస్తే, సనత్‌నగర్ టిమ్స్‌లోనే రెండు రకాల వైద్యం అందుతుంది. కాబట్టి మరో ఆసుపత్రికి తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే పక్షవాతం, నరాల సమస్యలు ఉన్నవారికి అత్యంత కీలకమైన ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ సేవలను అల్వాల్ టిమ్స్‌లోనే కలిపి అందించడం ద్వారా రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
ఒక ప్రధాన విభాగానికి అనుబంధంగా ఉండే ఇతర స్పెషాలిటీలను కూడా ఒకే దగ్గర అభివృద్ధి చేయడం వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉందని.. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడతామని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
