
వెలుగు బిజినెస్‌డెస్క్: క్రెడిట్ స్కోర్ల గురించి సర్వత్రా తప్పుడు సమాచారం వ్యాపిస్తోంది. చాలా మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఆన్‌లైన్ సలహాల ఆధారంగా పొరపాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా అనవసర ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయడం, ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండటం లేదా లోన్ త్వరగా తిరిగి చెల్లించడం స్కోర్‌ను దెబ్బతీస్తుందని నమ్ముతున్నారు. ఇవన్నీ నిజాలు కావు. మీ క్రెడిట్ స్కోర్‌ను నిజంగా ఏవి ప్రభావితం చేస్తాయో తెలుసుకుంటే సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు.
సొంత క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేయడం
ప్రతి ఒక్కరూ తమ క్రెడిట్ స్కోర్ తగ్గకూడదని క్రెడిట్ రిపోర్ట్‌ను చూడటం మానేస్తారు. వాస్తవానికి, మీరు మీ సొంత క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేసినప్పుడు -అది సాఫ్ట్ ఎంక్వైరీ అవుతుంది. దీనివల్ల- మీకు ఎటువంటి హానీ ఉండదు. రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయడం వల్ల తప్పులను గుర్తించవచ్చు. ఎవరైనా మన ఐడీలతో లోన్లు తీసుకుంటే తెలుసుకోవచ్చు. హార్డ్ ఎంక్వైరీ చేస్తే మాత్రమే స్కోర్ తగ్గుతుంది. లోన్లు మంజూరు చేయడానికి బ్యాంకు మీ క్రెడిట్రిపోర్ట్ను చెక్చేయడాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఇవి ఎక్కువగా ఉంటే స్కోర్తగ్గవచ్చు. దీని ఎఫెక్ట్ కూడా తాత్కాలికమే!
ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండటం
ఎక్కువ సేవింగ్ లేదా చెకింగ్ అకౌంట్లు ఉండటం మంచిది కాదని అనుకుంటారు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ తగ్గదు. లోన్ పేమెంట్లు, క్రెడిట్‌కార్డుల సంఖ్య ఆధారంగా క్రెడిట్ స్కోరులో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎన్ని ఖాతాలు ఉన్నా ఏమీ కాదు. వాటిలోని డబ్బును సమర్థంగా వాడటమే ముఖ్యం.
పర్సనల్ లోన్‌ను త్వరగా చెల్లించడం
పర్సనల్ లోన్‌ను గడువు కంటే ముందే చెల్లించడం స్కోర్‌ను దెబ్బతీస్తుందని అనుకుంటారు. నిజానికి, రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం మీ క్రెడిట్‌కు పాజిటివ్అవుతుంది. లోన్‌ను తిరిగి చెల్లించడం వలన మీ యాక్టివ్ అకౌంట్ల సగటు వయస్సు కొద్దిగా తగ్గుతుంది. - ఉదాహరణకు, మీకు ఒక పాత క్రెడిట్ కార్డు, ఒక కొత్త క్రెడిట్ కార్డు, ఒక లోన్ ఉన్నాయనుకుందాం. లోన్ అకౌంట్ క్లోజ్ అయినప్పుడు, మీ మిగిలిన అకౌంట్ల సగటు వయస్సు కాస్త ప్రభావితం కావచ్చు. ఇది చాలా స్వల్పమైన ప్రభావం. కానీ ఇది మీరు లోన్‌ను తిరిగి చెల్లించగలరని కూడా చూపిస్తుంది. అంతిమంగా మీ క్రెడిట్ స్కోర్‌పై చాలా సానుకూల ప్రభావం ఉంటుంది.
క్రెడిట్‌స్కోర్‌కు సంబంధించిన చాలా విషయాల్లో జనంలో అపోహలు ఉన్నాయి. క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేయడం, ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం, లోన్ల వాయిదాల చెల్లింపు, అప్పులు తీసుకోవడం గురించి చాలా మంది అనవసరంగా ఆందోళన పడుతుంటారు. ఇలాంటి అపోహలపై అవగాహన కలిగించే కథనం ఇది.
క్రెడిట్ కార్డులో జీరో డెబిట్
క్రెడిట్ కార్డుపై ఎప్పుడూ కొంత అప్పు ఉంటేనే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని కొందరు పొరబడుతుంటారు. ఇది నిజం కాదు. స్కోర్ పెరగాలంటే ప్రతి నెలా బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించాలి. ఇది మీరు క్రెడిట్‌ను బాధ్యతాయుతంగా వాడుకుంటున్నారని సూచిస్తుంది. మీ క్రెడిట్ వాడకం నిష్పత్తిని తగ్గిస్తుంది. ఈ రెండూ మీ స్కోర్‌కు సహాయపడతాయి. నెలల తరబడి కార్డులో లోన్ ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.