
కరోనా లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు నెలలుగా భక్తులను అనుమతించడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా భక్తులకు దర్శనం నిలిపేసిన టీటీడీ.. వెంకన్నకు ఏకాంతంగా పూజలు నిర్వహిస్తోంది. శ్రీవారి అర్చకులు నిత్యం కైంకర్యాలు, సేవలు చేస్తున్నారు. అయితే దాదాపు రెండు నెలలుగా దర్శన భాగ్యం కరువైన భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయించింది.
టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ ప్రసాదం
ఇప్పటికే తిరుపతిలోని టీటీడీ కార్యాలయంలో లడ్డూ విక్రయాలను స్టార్ట్ చేసిన టీటీటీ ఇప్పుడు ప్రతి జిల్లాలోని టీటీడీ కల్యాణ మండపాల్లో వీటిని అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని బుధవారం మీడియాకు వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో శ్రీవారి దర్శనం మళ్లీ ఎప్పుడు పునః ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో భక్తులకు శ్రీవారి ప్రసాదాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూలను అందుబాటులో ఉంచుతామన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లడ్డూ ధరను సగానికి తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. రూ.50 ఉన్న లడ్డూ ప్రసాదాన్ని రూ.25కే భక్తులకు అందించాలని నిర్ణయించామన్నారు. పెద్దమొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలనుకునే వారు ప్రత్యేక ఆర్డర్ చేసుకోవచ్చని సూచించారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ – 98495 75952, ఆలయ పేష్కార్ శ్రీనివాస్ – 97010 92777ను సంప్రదించవచ్చని చెప్పారు.
దర్శనం లేకున్నా శ్రీవారి హుండీకి కానుకలు
కరోనా లాక్ డౌన్ కారణంగా శ్రీవారి దర్శన భాగ్యం లేకున్నా భక్తులు ఏప్రిల్ నెలలో ఆన్ లైన్ ఈ-హుండీ ద్వారా దాదాపు రూ.2 కోట్ల కానుకలు అందజేశారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 2019 ఏప్రిల్ నెలలో ఈ-హుండీ ద్వారా రూ.1.79 కోట్లు రాగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో రూ.1.97 కోట్లు వచ్చినట్లు చెప్పారు. ఈ ఏడాది అదనంగా రూ.18 లక్షలు పెరిగినట్లు చెప్పారు. లాక్ డౌన్ కారణంగా నేరుగా శ్రీవారి దర్శనానికి రాలేకపోయినా.. ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించిన భక్తులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.