తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదాన్ని రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్‌లో విక్రయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇందులో బాగంగా తిరుమల నుంచి 40 వేల లడ్డూలను హైదరాబాద్‌కు పంపించినట్లు తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేకపోతున్న నేపథ్యంలో భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. గత 6 రోజులుగా ఏపీలోని 13 జిల్లాల్లో లడ్డూలను విక్రయించగా.. దాదాపు 13 లక్షల మంది భక్తులు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో లడ్డూ ప్రసాదాల విక్రయాలకు ఆయా ప్రభుత్వాల అనుమతి తీసుకుని ఈ మేరకు చర్యలు చేపడుతోంది టీటీడీ. ఈ క్రమంలో మే 31 నుంచి హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ టీటీడీ ఆఫీసులో లడ్డూలను అందుబాటులో ఉంచబోతోంది. సాధారణ రోజుల్లో లడ్డూ ధర 50 రూపాయలు ఉండగా ప్రస్తుతం 50% సబ్సిడీతో ఒక్కో లడ్డూ రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటోంది.
