
కరోనా వైరస్ ను అరికట్టుందుకు లాక్ డౌన్ ను విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో కేవలం నిత్యవసర వస్తువుల అమ్మకాల షాపులకు తప్ప అన్నింటినీ మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగా ఆలయాలు కూడా మూసివేశారు. ముఖ్యంగా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకాలు ఇవాళ్టి (శనివారం) ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం దగ్గర వీటిని భక్తులకు అమ్ముతున్నారు. లాక్‌డౌన్ తో 55 రోజుల పాటు నిలిచిపోయిన శ్రీవారి లడ్డూల అమ్మకాలు ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. అంతేకాదు త్వరలోనే సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.