వైభవంగా శ్రీవారి చక్రస్నానం.. అక్టోబ‌రు 24న పార్వేట ఉత్సవానికి ఏర్పాట్లు

వైభవంగా శ్రీవారి చక్రస్నానం.. అక్టోబ‌రు 24న పార్వేట ఉత్సవానికి ఏర్పాట్లు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ( అక్టోబర్ 23) ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం ( అక్టోబర్ 23)  తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు.. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామివారి శిష్యబృందం పఠించారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదిరోజులు జరిగాయి. ఈ ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - యావన్మంది ప్రజలు,  భక్తులు సుఖశాంతులతో తులతూగాలని స్వామివారికి  - చక్రస్నానం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమ‌ణ క‌రుణాక‌ర్ రెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ప‌లువురు బోర్డు స‌భ్యులు, జేఈవోలు శ్రీమ‌తి స‌దాభార్గవి, శ్రీ వీర‌బ్రహ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అక్టోబ‌రు 24న పార్వేట ఉత్సవం 

 అక్టోబ‌రు 24వ తేదీ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి పార్వేట ఉత్సవం నిర్వహించ‌నున్నారు. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు జరుగుతుంది. అధికమాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 

ALSO READ : PAK vs AFG: ఫలించిన పాక్ ఆటగాళ్ల శ్రమ.. ఈ ఏడాదిలో మొదటి సిక్స్ కొట్టారు