తిరుమల నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 తరువాత పిల్లలకు నో ఎంట్రీ

తిరుమల నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 తరువాత  పిల్లలకు నో ఎంట్రీ

తిరుమల నడక మార్గంలో   భక్తుల భద్రత విషయమై టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.  అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తరువాత  15 సంవత్సరాల లోపు పిల్లలను అనుమతించమని టీటీడీ అధికారులు తెలిపారు.  సాయంత్రం 6 గంటల తరువాత రెండో ఘాట్ రోడ్డులో బైక్ లను నిషేధించారు. అలిపిరి నుంచి గాలి గోపురం 7వ మెట్టు వద్ద చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు.  మొత్తం ఐదు ప్రాంతాల్లో చిరుత తిరుగుతున్నట్లు ఆనవాళ్లను గుర్తించామని అటవీ అధికారులు తెలిపారు. 

ఇదిలా ఉండగా ..తిరుమల అలిపిరి  నడక మార్గంలో ఈరోజు ( ఆగస్టు 13) ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు.  చిన్నారుల తల్లిదండ్రులు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఫారెస్ట్ అధికారులు, ఇతర భద్రతా సిబ్బంది  సోదా చేశారు.  ఇటీవల ఏడుకొండల స్వామిని దర్శించేందుకు  నడక మార్గంలో వెళ్తున్న భక్తులపై చిరుత పులులు దాడి ఘటనలు ఎక్కువయ్యాయి.  దీంతో గాబరా పడిన ఆ చిన్నారుల పేరంట్స్ తల్లడిల్లిపోయారు.  అయితే  తప్పిపోయిన చిన్నారులను టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించి... వారి తల్లి దండ్రులకు అప్పగించారు.  నిన్న ( ఆగస్టు 12)న కూడా ఘాట్ రోడ్, నడక మార్గంలో ఐదు చిరుతలు సంచారం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు.  అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాల్లో ... గాలిగోపురం నుంచి 7 వ మైలు ప్రాంతంలో.. రెండో ఘాట్ రోడ్డు 38 వ మలుపు దగ్గర చిరుత తిరిగిందని టీటీడీ భద్రతా సిబ్బంది తెలిపారు.  దీంతో తిరుమల శ్రీవారిని దర్శించేందుకు నడకమార్గంలో వచ్చే భక్తులకు కొన్ని ఆంక్షలు విధించారు.  

దర్శనానికి నడక దారిలో వెళ్తున్న భక్తుల భద్రత విషయంలో కీలక ఆంక్షలు విధించింది. అలిపిరి–తిరుమల మార్గంలో ఇకపై వంద మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. వారికి రక్షణగా ముందు వెనుక రోప్ ను, సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేసింది. ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసిన చంపిన చిరుతను పట్టుకునేందుకు సంబంధిత అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు.