ప్రమాదపు అంచుల్లో తిరుపతి రాయలచెరువు 

ప్రమాదపు అంచుల్లో తిరుపతి రాయలచెరువు 
  • చెరువు దిగువన వందలాది గ్రామాలు

తిరుపతి: నగర శివారులో రామచంద్రాపురం వద్ద ఉన్న రాయల చెరువు కట్ట ప్రమాదపు అంచుల్లో ఉంది. ఏ క్షణంలోనైనా చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు. చెరువు కట్ట కుంగినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. చెరువుకట్ట నుంచి మట్టి జారుతోంది. పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో రాయల చెరువు ప్రాంతానికి రాకపోకలను ఆపేశారు. కట్టలో అక్కడక్కడ నీరు లీకేజీ అవుతోందని, చెరువు కట్ట నుంచి మట్టి జారుతోందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 
చెరువును మరమ్మత్తు చేసే అవకాశాలు లేనందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. రాయల చెరువు కింద కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ చెరువు కట్టినప్పటి నుంచి ఈ స్థాయి నీరు రాలేదని గ్రామస్థులు అంటున్నారు. కట్ట తెగితే ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి రాయల చెరువు వద్ద ఏర్పడిందని అనుమానిస్తున్నారు. 
గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
తిరుపతి రాయల చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరద నీరు గరిష్ట స్థాయికి చేరుకుంది. చెరువు కట్ట నుంచి మట్టి జారుతుండడం గమనించిన స్థానికులు ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం పొంచి ఉండడంతో చెరువు దిగువ పల్లెలను అధికారులు అప్రమత్తం చేశారు. రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరులో అప్రమత్తత గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లిలో అప్రమత్తత గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరులో అప్రమత్తత వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో అప్రమత్తత పల్లెలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. చెరువు కట్ట దగ్గర పరిస్థితిని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించి సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఓ పూజారి సాహసం చేశారు.  గంగ ఉప్పొంగకు.. అంటూ లీకేజ్ ప్రాంతంలో స్థానిక పూజారి ప్రతాప్ పూజలు నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.