హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: శానిటేషన్, ట్రాన్స్‌పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీజేఎస్ చీఫ్ కోదండరాం కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్స్ యూనియన్ ప్రతినిధులతో కలిసి జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. శానిటేషన్ కార్మికుల సమస్యలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలికు వివరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
పారిశుద్ధ్య కార్మికులకు కిట్లు ఇవ్వాలని, జీతాలు పెంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని, అటెండెన్స్ మూడుసార్లు కాకుండా రెండుసార్లు తీసుకోవాలని కోరారు. ట్రాన్స్‌పోర్ట్ కార్మికులను ఈవీడీఎంకి పంపారని, వారిని ట్రాన్స్‌పోర్టుకు తిరిగి తీసుకురావాలన్నారు. కోవిడ్ లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కార్మికులు మనందరి కోసం పనిచేశారని గుర్తుచేశారు. కార్మికుల సమస్యలపై సీఎంతో కూడా చర్చించి పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు.
జీహెచ్ఎంసీ జేఏసీ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలోని ఎస్ఎఫ్ఏకు ప్రతి నెలా 30 లీటర్ల పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలని, ఫీల్డ్‌లో మరణించిన వారి కుటుంబాలకు పీఎఫ్, ఈఎస్ఐ ఏర్పాటు చేయాలని కోరారు. శానిటరీ విభాగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి నెలకు రూ.25 వేల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వాటర్ బోర్డులోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోదండరాం కోరారు.
ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు హెడ్డాఫీసులో ఎండీ అశోక్ రెడ్డిని కలిసి సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎండీ త్వరలో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
