
హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఇవాళ కరీంనగర్ లో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను రాహుల్ కు కోదండరాం వివరించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని, ఇందుకోసం తమ పార్టీకి నాలుగు సీట్లు తమకు కేటాయించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రూపొందించిన ఓ రిపోర్ట్ ను రాహుల్ గాంధీకి అందించారు.
ప్రజాసంఘాలు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయాలని కోరారు. ఎల్లారెడ్డి, జహీరాబాద్, కోరుట్ల, ముథోల్ స్థానాలను టీజేఎస్ కు కేటాయించాలని కోదండరాం కోరగా సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీజేఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి చర్చిస్తారని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కలిసి పనిచేద్దామని రాహుల్ చెప్పారు. కోదండరాం వెంట పీఎల్ విశ్వేశ్వర్ రావు, అంబటి శ్రీనివాస్, బైరి రమేశ్, నిజ్జన రమేశ్, వినోద్, మోహన్, కిరణ్ రత్నం తదితరులున్నారు.