వైద్యంపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం : కోదండరాం

వైద్యంపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం : కోదండరాం

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, దీంతో వైద్యరంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మండి పడ్డారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణలో కార్పొరేట్ శక్తుల చేతిలో వైద్యం’ అనే అంశంపై  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా వైద్యంపై సర్కారు 4 శాతమే ఖర్చు చేస్తున్నదని,  సర్కారు వైద్యాన్ని నిర్లక్ష్యం చేసి కార్పొరేట్ వైద్యాన్ని పెంచుతోందన్నారు. దీంతో ప్రజలకు ప్రజా వైద్యంపై నమ్మకం పోతోందన్నారు.  ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులపై రెగ్యులేటరీ అథారిటీ ఉండాలని,  వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

రమ్యది ప్రభుత్వ హత్యే: ఆకునూరి

యశోద ఆస్పత్రి లో మృతి చెందిన రమ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్రంలో రమ్యలాంటి వారు ఎందరో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్లూ ప్రింట్ ఉంటుంది  కానీ.. రాష్ట్రంలో విద్య, వైద్యంపై ఎలాంటి బ్లూ ప్రింట్ లేదని ధ్వజమెత్తారు. రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా.. ఉస్మానియా లాంటి హాస్పిటల్​కట్టలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకున్న కమీషన్లతో పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టొచ్చన్నారు. రాష్ట్రంలో వైద్య పరిపాలన జీరో అయిందని, ప్రభుత్వం దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రమ్య మృతి ఘటనలో రెండు ఆసుపత్రులపై కేసు నమోదు చేయించాలన్నారు. రమ్య తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ.. తన కూతురు మృతిని ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ఉద్యమ నేత గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణ లో విద్య, వైద్య రంగాలు కుంటుపడి పోయాయన్నారు. జర్నలిస్టు విఠల్ మాట్లడుతూ.. రమ్య మృతికి కారణాలేంటో యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు శవాల మీద పేలాలను ఏరుకుంటున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం నడిపే కార్పొరేట్ చేతుల్లో ప్రభుత్వాలు బందీ అయ్యాయని ఆరోపించారు. పేదలకు ఉచిత వైద్యం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. జర్నలిస్టు రఘు మాట్లాడుతూ.. రమ్య మృతికి కారణాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.