- లోక్‌సభ స్పీకర్‌ను కలిసి కోరుతామన్న 19 మంది తిరుగుబాటు ఎంపీలు
- పార్టీ పార్లమెంటరీ వర్గం ఏర్పాటు చేయాలని ఇప్పటికే లేఖ
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. వచ్చే వారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమను అసలైన టీఎంసీ పార్లమెంటరీ గ్రూప్‌గా గుర్తించాలని కోరనున్నట్లు 19 మంది తిరుగుబాటు ఎంపీలు ప్రకటించారు. ఎంపీ జగదీశ్ చంద్ర బర్మా బసునియా మాట్లాడుతూ, ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్‌కు లేఖ సమర్పించామని చెప్పారు.
సోమవారం అధికారికంగా తమ వాదనను వినిపిస్తామన్నారు. మే 19న స్పీకర్‌కు రాసిన ఆ లేఖలో తమకు మద్దతుగా 19 మంది ఎంపీలు సంతకాలు చేశారని చెప్పారు.
అసలైన టీఎంసీ ప్రతినిధులం తామేనని, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు కోరేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. కాగా, టీఎంసీకి చెందిన మొత్తం 28 మంది లోక్‌సభ ఎంపీలలో 19 మంది తిరుగుబాటు వర్గంలో ఉండగా, మిగతా 9 మంది మాత్రం మమతా బెనర్జీకి మద్దతుగా కొనసాగుతున్నారు.
వీళ్లలో ఇంకొందరి వైఖరి ఏంటనేది ఇంకా తెలియరాలేదు. అయితే, తిరుగుబాటు వర్గం ఎంపీలు బీజేపీలోగానీ, ఎన్డీయేలోగానీ చేరే ఉద్దేశం లేదని, స్వతంత్రంగా పనిచేస్తూ బెంగాల్ ప్రయోజనాల కోసం పోరాడతామని ప్రకటించింది. ప్రస్తుతం, టీఎంసీ పార్లమెంటరీ పక్షం అధికారికంగా చీలిపోతుందా లేదా అనేది లోక్‌సభ స్పీకర్, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంది.
పార్టీని చీల్చడం కుదరదు: మహువా
రాజ్యాంగంలోని 91వ సవరణ ద్వారా పార్టీ చీలిక (స్ప్లిట్) అనే నిబంధనను 2003లోనే తొలగించారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా గుర్తు చేశారు. “ఎంపీల సంఖ్య ఎంత ఉందనేది ముఖ్యం కాదు. పార్టీ నుంచి విడిపోవాలంటే అసలు రాజకీయ పార్టీ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మరో పార్టీలో విలీనం కావాలి. ఈ 19 మంది రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలి” అని ఆమె తిరుగుబాటు ఎంపీలనుద్దేశించి ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్‌లోకి టీఎంసీ, ఎన్సీపీ?
టీఎంసీకి చెందిన 19 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు ప్రకటించడంతో ఆ పార్టీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇదే సమయంలో టీఎంసీ, ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) కాంగ్రెస్ పార్టీలో విలీనం కావొచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఇందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత నానా పటోలే కామెంట్లు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దేశంలో ఓట్ల చీలికను అడ్డుకునేందుకు లౌకికవాద, సమానత్వ భావజాలం కలిగిన పార్టీలు కాంగ్రెస్‌లో కలిసే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అన్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీలు కూడా కాంగ్రెస్‌లో విలీనంపై ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ కామెంట్లను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొట్టిపారేశారు.
