ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తీసుకురండి.. ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ కు టీఎన్జీవో వినతి

ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తీసుకురండి.. ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ కు టీఎన్జీవో వినతి

హైదరాబాద్, వెలుగు:  ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని టీఎన్జీవో  కేంద్ర సంఘం జనరల్ సెక్రటరీ మారం జగదీశ్వర్, కస్తూరి వెంకటేశ్వర్లు, కట్కూరి శ్రీకాంత్ కోరారు. గురువారం ఈ అంశంపై సెక్రటేరియెట్ లో ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఏపీలో 84 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు  పనిచేస్తున్నారని తెలిపారు. వీరిని రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని నేతలు వినతిపత్రంలో వివరించారు.

ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ తెలంగాణకు వచ్చారని, కొంత మంది మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారని చెప్పారు. ఫ్యామిలీలు తెలంగాణలో  పెట్టుకుని.. గత 9 ఏండ్లుగా వారు ఏపీలో డ్యూటీ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  ఏపీ, తెలంగాణకు జర్నీ చేయలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరారు.  తమ వినతిపై స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు సానుకూలంగా స్పందించారని టీఎన్జీవో నేతలు తెలిపారు. ఈ అంశం ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.