ఆడ బిడ్డ సర్కారు బడికి.. అబ్బాయిలు ప్రైవేట్ కు

ఆడ బిడ్డ సర్కారు బడికి.. అబ్బాయిలు ప్రైవేట్ కు

బిడ్డ సర్కారు బడికే..ప్రైవేటు స్కూళ్లకు అబ్బాయిలు
విద్యా శాఖ అధికారిక లెక్కల్లోనే వెల్లడి
ఆర్థిక సమస్యలు, సెక్యూరిటీ వంటివే ప్రధాన కారణం
అడ్డగోలు ఫీజులు భరించలేక కొందరు..
ఆడపిల్లను వేరే ఊర్లకు పంపలేక మరికొందరు
కొడుకు బాగా చదివితే మంచీ చెడూ చూస్తడని
బిడ్డ పెండ్లికి ఎట్లయినా ఖర్చయితయని ఇంకొందరు
మగ పిల్లల చదువుపైనే దృష్టి పెడుతున్న తల్లిదండ్రులు
అన్ని కులాలు, వర్గాల్లోనూ ఇదే పరిస్థితి

పిల్లలిద్దర్నీ ప్రైవేటు బడికి పంపాలంటె వేలకు వేలు కావాలె.. అన్ని పైసలు పెట్టలేను. అందుకే బిడ్డను సర్కారు బడికి పంపుతున్న, కొడుకును ప్రైవేటులో వేసిన..కాలం మంచిగ లేదు.. ఆడపిల్లను వేరే ఊరికి పంపాలంటే భయమైతున్నది. అందుకే ఊర్లనే ఉన్న సర్కారు బడిలో చదివిస్తున్నం..బిడ్డకు పెండ్లి చేయాల్నంటే లక్షల కట్నం కావాలె, ఖర్చులకు ఇంకిన్ని పైసలు కావాలె. సంపాయించే పైసలు ఫీజులకేడ పెడ్తం. అందుకే బిడ్డను సర్కారు బడికి పంపుతున్నం..కొడుకు మాతోనే ఉంటడు.. బిడ్డకు లగ్గం చేసి ఓ ఇంటికి పంపక తప్పది. వాడు బాగా చదువుకుంటె మంచీ చెడు చూస్తడని ప్రైవేటుకు పంపుతున్నం..

ఇలా ఎన్నో కారణాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆడపిల్లలను సర్కారు బడికి, మగ పిల్లలను ప్రైవేటు బడికి పంపేందుకు దారితీస్తున్నాయి. ప్రధానంగా ఆర్థిక సమస్యలు, ఆడపిల్లలకు సెక్యూరిటీ వంటివి తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో అడ్డగోలుగా ఫీజులు పెరిగిపోవడంతో బడికి పంపేందుకే జంకుతున్నారు. ఎవరినో ఒకరినైనా ప్రైవేటులో చదివిద్దామనుకునే వారు కొడుక్కే ఫస్ట్​ ప్రయారిటీ ఇస్తున్నారు. కులాలు, వర్గాల వారనే తేడా లేకుండా అందరి ఆలోచనా ఇలాగే ఉంటోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. సర్కారీ స్కూళ్ల స్టూడెంట్లలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉండగా.. ప్రైవేటు స్కూళ్లలో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖ సేకరించిన అధికారిక లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కిందటేడాది ప్రైవేటు ఎడ్యుకేషన్​ ఇనిస్టిట్యూషన్స్​లో అమ్మాయిల కంటే అబ్బాయిల అడ్మిషన్లు పది శాతం వరకు ఎక్కువగా నమోదయ్యాయి. అదే సమయంలో సర్కారు బడుల్లో అబ్బాయిల అడ్మిషన్లు 5.5 శాతం తగ్గిపోయాయి. ఇంటర్, ఆ పైస్థాయి చదువుల విషయానికి వస్తే.. అబ్బాయిల శాతం చాలా ఎక్కువ. చాలా మంది పేరెంట్స్ అమ్మాయిలను టెన్త్ తర్వాత చదువు మాన్పించటమే అందుకు కారణమని
విద్యా వేత్తలు చెప్తున్నారు.

అదే అబ్బాయిలనైతే ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు, అవసరమైతే దూరంలో ఉన్న పట్టణాలకు పంపించి చదివిస్తున్నట్టు వెల్లడిస్తున్నారు.

విద్యా శాఖ లెక్కల ప్రకారమే..

రాష్ట్రంలో స్కూళ్లు, ఇంటర్‌‌ వరకు కాలేజీలు కలి పి మొత్తం 11,621 ప్రైవేటు విద్యా సంస్థలుంటే.. వాటిల్లో 16,53,352 మంది అమ్మాయిలు,19,73,352 మంది అబ్బాయిలు చదువుతున్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు 9 శాతం ఎక్కువ. ఇందుకు భిన్నంగా 29,822 సర్కారీ విద్యాసంస్థల్లో అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. సర్కారీ స్కూళ్లు, కాలేజీల్లో 14,80,127 మంది అమ్మాయిలుంటే.. అబ్బాయిల సంఖ్య 13,42,308 మంది మాత్రమే. అంటే అమ్మాయిలే 5.5 శాతం ఎక్కువగా ఉన్నారు. ప్రైవేటుతో పోలిస్తే తక్కువ ఫీజులు ఉండే ఎయిడెడ్​ విద్యా సంస్థల్లో 61 శాతం అమ్మాయిలు చదువుతుంటే, అబ్బాయిలు 39 శాతం మందే ఉన్నారు. రూరల్  ఏరియాలో ఎక్కువగా, అర్బన్​ ఏరియాల్లోనూ కొంత వరకు ఈ పరిస్థితి ఉంది. అన్ని కులాలు, వర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అమ్మాయిల కంటే అబ్బాయిల చదువుకే పేరెంట్స్​ ప్రాధాన్యత ఇస్తున్నారు.

బిడ్డ కండ్ల ముందు ఉంటదని..

బిడ్డ కండ్ల ముందు ఉండాలన్నది తల్లిదండ్రుల ఆరాటం. ప్రైవేట్ స్కూల్ వ్యాన్లలో పంపితే తోటి విద్యార్థులు ఏడిపించిండ్రు. అట్ల బిడ్డను వేరే ఊరికి పంపలేక ఉన్న ఊర్లనే గవర్నమెంటు స్కూళ్లో చదివిస్తున్నం. మాకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేస్తే వచ్చే పైసలతోటి ఇల్లు గడవడమే కష్టం. అయినా ఇద్దరు పిల్లలను ప్రైవేటులో చదవించాలంటె ముప్పై, నలభై వేలు కట్టాలె. అందుకే కొడుకు ఒక్కడినైనా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నం.

– శ్రీనివాస్, గంగాధర

బాగా చదువుతున్నడని..

నాకు ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులు. బిడ్డను, పెద్ద కొడుకును గవర్నమెంటు స్కూళ్లో చది విస్తున్నం. చిన్న కొడుకు చదువులో బాగా హుషారున్నడు. అందుకే కాన్వెంట్​లో వేసినం. బిడ్డను వేరే ఊర్లోని ప్రైవేటు స్కూలుకు పంపే పరిస్థితి లేదు. స్కూల్​కెళ్లి ఇంటికొచ్చేవరకు పాణంలో పాణం ఉంటలేదు.

– కావలిబాబు, నారాయణపేట జిల్లా

బిడ్డకు పెండ్లి చేసి పంపాలె గదా..

ఆడపిల్లలను చదివించినా ఎన్నడైనా పరాయింటికి వెళ్తుంది. పెండ్లి చేయాల్నంటే కట్నం, లాంఛనాలని చాలా సొమ్ము కావాలె. ఎట్లయినా ఆ ఖర్చు తప్పదు. కొడుకును చదివిస్తే మాతోనే ఉండి మంచీ చెడు చూసుకుంటడు. అందర్ని ప్రైవేటుల చదివించాలంటే పైసలు కావాలె. మా ముగ్గురు బిడ్డలను సర్కారు బడికే పంపుతున్న. కొడుకును ప్రైవేటు బడిలో వేసిన.

– పరశురాం, రైతు, అచ్చంపేట,
నారాయణపేట జిల్లా

అడ్డగోలు ఫీజులు కట్టలేకనే..

మాది మధ్య తరగతి కుటుంబం. ఒక కొడుకు, ఒక బిడ్డ. కొడుకు ప్రైవేట్ స్కూల్లో టెన్త్​ చదివిండు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలోనే ఇంటర్​ చదివిస్తున్నం. బిడ్డను ఐదో తరగతి దాకా ప్రైవేటు స్కూళ్లో చదివించి, తర్వాత గవర్నమెంట్ స్కూల్లో వేసినం. ఇప్పుడు ఎనిమిదో క్లాసు చదువుతోంది. బిడ్డను కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించాలని ఉంది. కానీ ఫీజులు బాగా పెంచడంతో కట్టలేక ఇబ్బంది పడ్డం. అసలు ఫీజులకు తోడు డ్యాన్స్, గేమ్స్, కరాటే అనుకుంట ఇంకిన్ని పైసలు వసూలు చేస్తున్నరు. గవర్నమెంట్ స్కూళ్లలో చదువు బాగానే చెప్తుండటంతో బిడ్డను దానిలోకి మార్చినం.

– ఎనుగందుల స్వప్న, చొప్పదండి

క్లాసుల వారీగా చూస్తే..

ప్రైమరీ స్కూళ్లలోనూ ప్రైవేటులో 54 శాతం బాయ్స్, 46 శాతం గర్ల్స్​ ఉన్నారు.. సర్కారులో గర్ల్స్​ 52 శాతం, బాయ్స్​48 మందే ఉండటం గమనార్హం. యూపీఎస్​ లెవల్​లో ప్రైవేటులో 56 శాతం బాయ్స్, 44శాతం గర్ల్స్ ఉండగా.. సర్కారీ స్కూళ్లలో 48 శాతం బాయ్స్, 52 శాతం గర్ల్స్​ఉన్నారు. హైస్కూల్​ లెవల్​లో ప్రైవేటులో 56 శాతం బాయ్స్, 44 శాతం గర్ల్స్ కాగా.. సర్కారీలో 47 శాతం బాయ్స్, 53 శాతం గర్ల్స్​చదువుతున్నారు. విద్యాసంస్థల్లో అడ్మిషన్ల తీరు ఇదీ..

మేనేజ్​మెంట్ బాయ్స్                       గర్ల్స్                             మొత్తం

ప్రైవేటు         19,73,383 (54.41%)        16,53,352 (45.58%)          36,26,735

సర్కారీ        13,83,765 (47.22%)        15,46,201(52.77%)           29,29,966

మొత్తం         33,57,148 (51%)            31,99,553 (49%)              65,56,701

(సర్కారీలో ఎయిడెడ్ స్కూళ్లు కలిసి ఉన్నాయి)

ఏ కులమైనా, వర్గమైనా ఇంతే..

ప్రభుత్వ స్కూళ్లలో..

కేటగిరీ అమ్మాయిలు      అబ్బాయిలు

ఎస్సీ    3.68 లక్షలు        3.42 లక్షలు

ఎస్టీ      2.55 లక్షలు        2.35 లక్షలు

బీసీ     7.42 లక్షలు        6.64 లక్షలు

జనరల్​                1.13 లక్షలు    లక్ష మంది

మరన్ని వార్తల కోసం..