
హైదరాబాద్: రాష్ట్రంలో పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు కఠిన చట్టాలు తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పొగాకుతో వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో వర్క్‌షాప్ జరిగింది. అందులో ఈటల మాట్లాడుతూ.. తల్లిదండ్రులను పిల్లలు ఫాలో అవుతుంటారని, వాళ్లకోసమైనా సిగరెట్లు, బీడీలు మానెయ్యాలని సూచించారు. పొగాకు అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు తీసుకోవాలన్నారు. పొగాకు వల్లే కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలకు ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నట్టు వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ సీమాగుప్తా వెల్లడించారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అదనపు డీజీపీ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.