హుజూరాబాద్​లో ఇయ్యాల్నే ఓట్లు

హుజూరాబాద్​లో ఇయ్యాల్నే ఓట్లు
  • పొద్దుగాల్ల 7 నుంచి పొద్దుమీకి 7 గంటల దాకా పోలింగ్​
  • పోటీలో బీజేపీ నుంచి ఈటల,  టీఆర్​ఎస్​ నుంచి గెల్లు, కాంగ్రెస్​ నుంచి బల్మూరి
  • సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలు 107.. 3,828 మంది పోలీసులతో భారీ బందోబస్తు
  • ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన ఈసీ .. నవంబర్​ 2న రిజల్ట్స్ 

హుజూరాబాద్‌‌ నుంచి ప్రత్యేక ప్రతినిధి / కరీంనగర్ / హైదరాబాద్, వెలుగు: ఐదారు నెలల నుంచి హోరెత్తుతున్న హుజూరాబాద్​ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్​ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్ధరాత్రి వరకు పోలింగ్​ జరిగే చాన్స్​ ఉందని, రాత్రి 7 గంటల లోపు పోలింగ్​ సెంటర్​లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. ఈ ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్​ బరిలో ఉన్నారు. వీరితో పాటు రిజిస్టర్డ్‌‌ పార్టీలకు చెందిన ఏడుగురు.. ఇండిపెండెంట్స్ 20 మంది ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్  కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,37,022 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,17,922 మంది పురుషులు ఉండగా.. 1,19,099 మంది మహిళలు ఉన్నారు. ఒక ట్రాన్స్​జెండర్ ఓటు ఉంది. హుజూరాబాద్  మండలంలో 61,673, ఇల్లందకుంట మండలంలో 24,799, జమ్మికుంట మండలంలో 59,020, వీణవంక మండలంలో 40,099, కమలాపూర్ మండలంలో 51,282 మంది ఓటర్లు ఉన్నారు. సర్వీసు ఓటర్లు 149 మంది ఉన్నారు.  ఇప్పటికే హుజూరాబాద్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నియోజకవర్గంలోని అన్ని  మండలాలు.. ఊర్లకు వీవీ ప్యాట్ లు, ఓటింగ్ యంత్రాలను సిబ్బందికి అందజేశారు.వీరంతా వారికి అప్పగించిన కేంద్రాలకు బయలుదేరారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలకు 306 పీవోలను, 306 ఏపీవోలను, 600 ఓపీవోలు, 33 మంది మైక్రో అబ్జర్వర్లను, 33 మంది సెక్టార్ ఆఫీసర్లను వినియోగిస్తున్నారు. వీరితో పాటు 2,100 పోలింగ్ సిబ్బందిని కేటాయించారు.  మొత్తం ఎన్నికల ప్రక్రియను వెబ్  కాస్ట్ చేయడానికి 306 మందిని ప్రత్యేకించి కిట్స్ కాలేజ్  ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ను తీసుకున్నారు. 
ఇప్పటికే 130 కేసులు
ఇప్పటికే ఉప ఎన్నిక సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింది 130 కేసులు బుక్ చేశారు.  మొత్తం రూ. 3.5 కోట్లు నగదు సీజ్ చేశారు.  హుజూరా బాద్ నియోజకవర్గంలోని మొత్తం ఐదు మండలాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  కేంద్ర  బలగాలను  వినియోగిస్తున్నారు.  సెగ్మెంట్​లో సుమారు 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి.. అక్కడ అదనంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 3,868 మంది పోలీసు బలగాలతో  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఈవో శశాంక్​ గోయల్​ చెప్పారు. ఇందులో 20 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయని తెలిపారు. ఈవీఎంల పరిశీలనకు అందుబాటులో ఆరుగురు ఇంజనీర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈవీఎంలకు సంబంధించి 421 కంట్రోల్​యూనిట్లు, 891 బ్యాలెట్​యూనిట్లు, 515 వీవీ ప్యాట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 
అర్ధరాత్రి వరకు పోలింగ్‌‌‌‌..! 
సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకే పోలింగ్​ ఉంటుంది. అయితే కరోనా నిబంధనల వల్ల ఈ సారి హుజూరాబాద్​లో పోలింగ్‌‌‌‌ సమయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పెంచారు. ఓటర్లు రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌‌‌‌ కేంద్రంలోకి చేరుకునే వీలుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఒక్కసారి కేంద్రంలోకి ప్రవేశించిన ఓటరు ఎంత ఆలస్యమైనా సరే.. ఓటు వేసేందుకు అర్హులు. అంటే రాత్రి 7 గంటల్లోపు కేంద్రంలోకి చేరుకునే వీలు ఉండటంతో ఈసారి పోలింగ్‌‌‌‌ అర్ధరాత్రి  వరకు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆఫీసర్లు  భావిస్తున్నారు. హుజూరాబాద్​ నియోజకవర్గంలో శనివారం సెలవు దినంగా ప్రకటించింది. ఎన్నిక ఏర్పాట్లు పూర్తయినట్లు  జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌‌ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ చెప్పారు. అన్ని చోట్లా ఓటర్లకు తాగునీరు, షామియానాలు, వికలాంగులకు ప్రత్యేక ర్యాంపులు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు.  హుజూరాబాద్​  నియోజకవర్గ స్థానానికి 2018లో జరిగిన జనరల్​ఎలక్షన్స్​లో 84.5 శాతం పోలింగ్‌‌‌‌ నమోదైందని, ఈసారి ఓటింగ్ శాతం మరింత పెరగాలని కోరుతున్నట్లు సీఈవో శశాంక్​ గోయల్​ చెప్పారు. కాగా, ఎన్నిక ఫలితాలు నవంబర్‌‌ 2న వెలువడనున్నాయి. 
కలిసిరానున్న సమయం! 
ఈసారి పోలింగ్‌‌‌‌ టైమ్‌‌ను రెండు గంటలు పొడిగించారు. ఇది రాజకీయ పార్టీలకు కలిసిరానుంది. నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్లు కూడా ఈజీగా ఇక్కడికి చేరుకునేలా  సమయం అనుకూలంగా ఉంది. ఉదాహరణకు హుజూరాబాద్‌‌‌‌లో ఓటు ఉన్న ఒక ఓటరు కనీసం 400 కి.మీ దూరంలో ఉన్నా సరే.. శనివారం ఉదయం బస్సు ఎక్కి బయల్దేరినా రాత్రి 7 గంటలలోపు పోలింగ్‌‌‌‌ కేంద్రానికి చేరుకోవచ్చు.