నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో వన్డే

నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో వన్డే

గెలిచి నిలిచేనా?

ఒత్తిడంతా టీమిండియాపైనే

సిరీస్​పై కంగారూల గురి 

మ 1.30 నుంచి స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో

అనూహ్య ఓటమితో వాంఖడేలో తలదించుకున్న కోహ్లీసేన మరో పోరాటానికి రెడీ అయ్యింది. వన్‌‌సైడ్‌‌ విక్టరీతో తమకు షాకిచ్చిన ఆస్ట్రేలియాతో మరోసారి తలపడనుంది. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్నా.. సొంతగడ్డపై కంగారూలకు మరో సిరీస్‌‌  కోల్పోకుండా ఉండాలన్నా విజయం సాధించడమే ఇండియా ముందున్న మార్గం. రాజ్‌‌కోట్‌‌లో నేడు జరిగే చావారేవో లాంటి మ్యాచ్‌‌లో టీమిండియా ఏం చేస్తుందో మరి..!  గెలిచి సిరీస్‌‌ రేసులో నిలుస్తుందా.. ఓడి మరోసారి తలదించుకుంటుందా..?

రాజ్‌‌కోట్‌‌: ఓటమికి కారణాలు అనేకం. కానీ దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం ముఖ్యం. అతి విశ్వాసమో.. సొంతగడ్డపై మనకు ఎదురులేదన్న ధీమానో తెలీదు కానీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్‌‌ వన్డేలో టీమిండియా దారుణంగా ఓడింది. బలమైన ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో ప్రయోగాలు చేసి ముంబైలో ఉసూరుమన్న కోహ్లీ సేన మరో సవాల్‌‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా శుక్రవారం జరిగే  రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో మరో సారి తలపడనుంది. సిరీస్‌‌ రేస్‌‌లో నిలవాలంటే విజయం తప్పనిసరైన పరిస్థితుల్లో కోహ్లీ సేన ఒత్తిడిలో ఉండగా.. రాజ్‌‌కోట్‌‌లోనే పని పూర్తి చేయాలని ఫించ్‌‌ సైన్యం పట్టుదలగా ఉంది.

కోహ్లీ బ్యాక్‌‌ టూ త్రీ !

సిరీస్‌‌ కోల్పోయే ముప్పు పొంచి ఉండడంతో ఇండియా ఈ మ్యాచ్‌‌లో ప్రయోగాలకు చిన్న బ్రేక్​ ఇచ్చే చాన్సుంది. ఎప్పటిల్లాగే కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ వన్‌‌డౌన్‌‌లో బ్యాటింగ్‌‌కు రావొచ్చు. అయితే రోహిత్‌‌శర్మ, కేఎల్‌‌ రాహుల్‌‌, శిఖర్‌‌ ధవన్‌‌లో ఏ ఇద్దరు ఇన్నింగ్స్‌‌ ఓపెన్‌‌ చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. మేనేజ్‌‌మెంట్‌‌ కోరితే మూడో స్థానంలో బ్యాటింగ్‌‌కు వస్తానని ధవన్‌‌ అన్నాడు. కానీ రోహిత్‌‌– ధవన్‌‌ జోడీని కొనసాగించే చాన్సే ఎక్కువ. ఫస్ట్‌‌ వన్డేలో గాయపడిన రిషబ్‌‌ పంత్‌‌ ఈ మ్యాచ్‌‌కు దూరమవడంతో మరోసారి కీపర్‌‌గా సేవలందించనున్న రాహుల్‌‌…శ్రేయస్‌‌ అయ్యర్‌‌తో కలిసి మిడిలార్డర్‌‌ బాధ్యత తీసుకోవచ్చు. పంత్‌‌ ప్లేస్‌‌లో కేదార్‌‌ జాదవ్‌‌, మనీశ్‌‌ పాండేలో ఒకరు ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో ఉంటారు. బౌలర్‌‌గా కూడా పనికొస్తాడు కాబట్టి కేదార్‌‌ వైపే మొగ్గు చూపొచ్చు. అయితే, కాంబినేషన్‌‌ ఎలా ఉన్నా  బ్యాటింగ్‌‌లో ఇండియా మెరుగైన పెర్ఫామెన్స్‌‌ చేయాల్సి ఉంది. ముంబైలో నిరాశ పరిచిన రోహిత్‌‌, కోహ్లీ జట్టు బాధ్యత తీసుకోవాలి. అయ్యర్‌‌ కూడా పేలవ షాట్లకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసీస్‌‌ పదునైన బ్యాటింగ్‌‌ లైనప్‌‌ దృష్ట్యా  భారీ టార్గెట్‌‌ను సెట్‌‌ చేసేందుకైనా.. ఛేజ్‌‌ చేసేందుకైనా  కోహ్లీసేన రెడీగా ఉండాల్సిందే.

బుమ్రా హిట్‌‌ అవ్వాల్సిందే

గత మ్యాచ్‌‌లో మిడిలార్డర్‌‌ వైఫల్యం కంటే బౌలింగ్‌‌ ఫెయిల్యూరే ఇండియాను దెబ్బకొట్టింది. రీఎంట్రీ తర్వాత ఇప్పటిదాకా తన స్థాయిని చూపెట్టలేకపోయిన పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా రాణించడం ఈ మ్యాచ్‌‌లో టీమిండియాకు కీలకం. బుమ్రా పూర్వపు ఫామ్‌‌ అందుకుంటే మిగిలిన బౌలర్లలోనూ జోష్‌‌ వస్తుంది. మరో సీనియర్‌‌ షమీ లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌కు కట్టుబడితేనే ఆసీస్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను అడ్డుకోగలడు. ఫస్ట్‌‌ వన్డేలో భారీగా రన్స్‌‌ ఇచ్చిన  శార్దుల్‌‌ ఠాకూర్‌‌ను కొనసాగిస్తారో లేక నవ్‌‌దీప్‌‌ సైనీని తీసుకుంటారో చూడాలి. రాజ్‌‌కోట్‌‌ వికెట్‌‌ స్పిన్నర్లకు పెద్ద సహకరించే చాన్స్‌‌ లేకపోవడంతో కుల్దీప్‌‌, చహల్‌‌లో ఒకరే ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో ఉండొచ్చు.

ఫుల్‌‌జోష్‌‌లో కంగారూలు

అదిరిపోయే విక్టరీతో టూర్‌‌ను, సిరీస్‌‌ను మొదలుపెట్టిన ఆసీస్‌‌ జట్టు ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది. ఇండియాలో ఇండియాపై వరుసగా రెండో సిరీస్‌‌ గెలిచి రికార్డు సృష్టించాలని పట్టుదలగా ఉంది. ఫించ్‌‌, వార్నర్‌‌ ఫామ్‌‌ కొనసాగిస్తే భారీ స్కోరు ఖాయమనే చెప్పాలి. ఆ తర్వాత  స్టీవ్‌‌ స్మిత్‌‌, లబుషేన్‌‌, టర్నర్‌‌, క్యారీతో  మిడిలార్డర్‌‌ కూడా బలంగా ఉంది. వీరంతా  తలా ఓ చేయి వేస్తే  హోమ్‌‌టీమ్‌‌కు ఇబ్బందులు తప్పవు. మరో పక్క టీమిండియాను ఫస్ట్‌‌ వన్డేలో ఆలౌట్‌‌ చేసిన ఆసీస్‌‌ బౌలర్లు తమ స్థాయిని చూపెట్టారు. పేసర్లు స్టార్క్‌‌, కమిన్స్‌‌, రిచర్డ్‌‌సన్‌‌తో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీసిన జంపా, అగర్‌‌ కూడా మంచి టచ్‌‌లో ఉన్నారు.

రాజ్‌‌కోట్‌‌లో రాత మారేనా?

రాజ్‌‌కోట్‌‌లోని సౌరాష్ట్ర క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ స్టేడియంలో టీమిండియాకు చెత్త రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన రెండు వన్డేల్లోనూ ఇండియా ఓడిపోయింది.2013 జనవరిలో ఇంగ్లండ్‌‌, 2015 అక్టోబర్‌‌లో సౌతాఫ్రికాతో ఇక్కడ ఆడిన మ్యాచ్‌‌ల్లో ఇండియా ఓటమి పాలైంది. మరోపక్క ఆస్ట్రేలియాకు రాజ్‌‌కోట్‌‌లో మంచి రికార్డుంది. 1986 అక్టోబర్‌‌లో ఇక్కడ ఆడిన వన్డేలో ఆసీస్‌‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే 2013 అక్టోబర్‌‌లో ఎస్‌‌సీఏ  స్టేడియంలో ఓ టీ20 ఆడిన కంగారూ టీమ్‌‌

సొంతగడ్డపై  ఆస్ట్రేలియాతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఇండియా ఓడిపోలేదు. రాజ్‌కోట్‌లో ఓడితే ఈ చెత్త రికార్డు మన జట్టు ఖాతాలో చేరుతుంది.

ఈ మ్యాచ్‌‌లో ఓడితే టీమిండియా సొంతగడ్డపై వరుసగా రెండు వన్డే సిరీస్‌‌లు ఆస్ట్రేలియాకు కోల్పోనుంది.

జట్లు(అంచనా)

ఇండియా : ధవన్‌‌, రోహిత్‌‌, రాహుల్‌‌(కీపర్‌‌), కోహ్లీ(కెప్టెన్‌‌), అయ్యర్‌‌, కేదార్‌‌ జాదవ్‌‌, జడేజా, శార్దుల్‌‌ఠాకూర్‌‌/సైనీ, కుల్దీప్‌‌/ చహల్‌‌, షమీ, బుమ్రా.

ఆస్ట్రేలియా : ఫించ్‌‌(కెప్టెన్‌‌), వార్నర్‌‌, లబుషేన్‌‌, స్మిత్‌‌, క్యారీ(కీపర్‌‌), టర్నర్‌‌, అగర్‌‌, కమిన్స్‌‌, స్టార్క్‌‌, రిచర్డ్‌‌సన్‌‌, జంపా.

పిచ్‌‌/వాతావరణం

ఎండ తీవ్రతకు రాజ్‌‌కోట్‌‌లోని పిచ్‌‌  డ్రై గా మారింది. పైగా గురువారం పిచ్‌‌ను బాగా రోల్‌‌ చేశారు. వాంఖడేతో పోలిస్తే బ్యాట్స్‌‌మన్‌‌కు ఎక్కువ సహకారం లభిస్తుంది. భారీ స్కోర్లు నమోదయ్యే చాన్సుంది. మ్యాచ్‌‌కు వాన ముప్పు లేదు.