- నేటి నుంచి విండీస్‌తో తొలి మ్యాచ్
- కాంబినేషన్‌పై కోహ్లీ కసరత్తులు
- గెలుపే లక్ష్యంగా విండీస్
- రా. 7 నుంచి సోనీ టెన్‌లో
నార్త్ సౌండ్ (అంటిగ్వా): టీ20, వన్డే సిరీస్‌లను గెలిచి ఊపుమీదున్న టీమిం డియా.. విండీస్ గడ్డపై అసలు పరీక్షకు సిద్ధమైంది. పర్‌ఫెక్ట్ టీమ్ కాంబినేషన్‌తో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలని భావిస్తున్న కెప్టెన్ విరాట్.. ‘వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్’ను ఘనంగా ఆరంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఇండియా.. విండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సారథిగా, బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డులకు చేరువలో ఉన్న విరాట్ వాటిని అందుకోవాలని చూస్తున్నాడు. హోమ్ టీమ్‌కు సొంతగడ్డ అనుకూలత ఉన్నా.. మిగతా అంశాల్లో టీమిండియానే బలంగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ మ్యాచ్‌లో విరాట్‌సేన ఫేవరెట్‌గా దిగుతున్నది. అయితే పాత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే ఆధిపత్యం మాత్రం విండీస్‌దే. 1948 నుంచి ఇరుజట్ల మధ్య 23 టెస్ట్ సిరీస్‌లు జరగగా, విండీస్ 12, ఇండియా 9 సార్లు గెలిచాయి. కానీ గత 17 ఏళ్ల నుంచి టీమిండియాకు మాత్రం ఎదురులేదు. 2016లో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను కోహ్లీసేన 2–-0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.
వేటు ఎవరిపై?
విండీస్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లో ఇండియా బలంగా కనిపిస్తున్నా.. ఫైనల్ ఎలెవన్‌లో ఎవరు ఉంటారన్న దానిపైనే సందిగ్దత కొనసాగుతోంది. ఒకవేళ ఆల్‌రౌండర్ హార్దిక్ అందుబాటులో ఉంటే కచ్చితంగా రహానె, రోహిత్‌లో ఒకర్ని తప్పించేవారు. కానీ కరీబియన్ వాతావరణ పరిస్థితులు, ఇటీవల అక్కడ ఆడిన ఇతర జట్ల ఆటతీరును పరిగణనలోకి తీసుకుంటే ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ అవసరం కనిపిస్తున్నది. కాబట్టి ఈ ఇద్దర్ని తుది జట్టులో తీసుకున్నా ఆశ్చర్యం లేదు. గ్రీన్ టాప్ వికెట్ అయితే మాత్రం ఐదుగురు బౌలర్ల వ్యూహానికి కట్టుబడొచ్చు. అంటే ఆల్‌రౌండర్‌గా జడేజా ఫైనల్ ఎలెవన్‌లోకి వస్తాడు. అప్పుడు ఇద్దరు ముంబైకర్లలో (రహానె, రోహిత్) ఒకరిపై వేటు ఖాయం. అది ఎవరన్నది టాస్‌కు ముందే తేలనుంది. మిడిలార్డర్‌తో పోలిస్తే ఓపెనింగ్‌లో కొత్త సమస్య తలెత్తింది. శిఖర్ ధవన్ గైర్హాజరీతో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించేంది ఎవరు? . కామన్ లాజిక్ అయితే స్పెషలిస్ట్ ఓపెనర్‌గా ఉన్న రాహుల్ రావాలి. కానీ ఆస్ట్రేలియాలో తెలుగు కుర్రాడు విహారి బాగా ఆడాడు. అతనికి మరో అవకాశం ఇవ్వడమనేది న్యాయం. బలమైన విండీస్ పేస్ అటాక్‌పై విహారి చెలరేగితే అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ మద్దతు మాత్రం రాహుల్‌కే ఎక్కువ ఉంది. బౌన్సీ పిచ్ ఎదురైతే మాత్రం కోహ్లీ నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లకే కట్టుబడే చాన్స్ ఉంది. అంటే పేసర్లుగా బుమ్రా, షమీ, ఇషాంత్ ఖాయం కాగా, ఏకైక స్పిన్నర్ స్థానం కోసం అశ్విన్, కుల్దీప్ పోటీపడనున్నారు. అనివార్య పరిస్థితులు ఎదురై, పిచ్ పేస్‌కు స్వర్గధామమైతే నాలుగో పేసర్‌గా ఉమేశ్‌కు అవకాశం దక్కొచ్చు.
కుర్రాళ్లతో ప్రమాదమే..
ప్రస్తుతం విండీస్ ఈ ఫార్మాట్‌లో ప్రమాదకరంగా కనిపించకపోయినా.. టీమ్‌లో ఉన్న కుర్రాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. హోప్, క్యాంప్‌బెల్, హెట్‌మయర్.. ఈ ముగ్గురు టెస్ట్‌ల్లో అత్యంత కీలకం. ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో ఈ త్రయం బ్యాటింగ్ భారాన్ని సమర్థంగా మోసింది. డారెన్ బ్రావోను కూడా తక్కువగా అంచనా వేయలేం. రోస్టన్ ఛేజ్ రూపంలో నాణ్యమైన మరో బ్యాట్స్‌మన్ అందుబాటులో ఉండటం విండీస్‌కు కలిసొచ్చే అంశం. 2016లో జరిగిన సిరీస్‌లో ఛేజ్.. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్‌కు అదనంగా మంచి ఆఫ్ స్పిన్ బంతులు వేయగల నేర్పరి. బౌలింగ్‌లో కీమర్ రోచ్, గాబ్రియెల్‌తో పాటు హోల్డర్ కీలకం. పాత తరం బౌలింగ్‌ను గుర్తుకు తెస్తూ నిలకడగా స్పెల్స్ వేయగల సామర్థ్యం ఈ త్రయం సొంతం. వీళ్లందర్ని పక్కనబెడితే విండీస్ బోర్డు ఏరికోరి తెచ్చుకున్న కొత్త ‘జెయింట్ కిల్లర్’ రకీమ్ కార్నివాల్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. 6.6 అడుగుల ఎత్తు, 140 కేజీల బరువుతో ఉండే రకీమ్.. ఎఫెక్టివ్ ఆఫ్ బ్రేక్ బాల్స్ వేయడంలో దిట్ట. అలాగే లోయర్ మిడిలార్డర్‌లో టీమ్‌కు ఉపయుక్తమైన పరుగులు అందించే సత్తా కూడా ఉంది.

