
ముంబై స్పీడుకు అడ్డుందా?
అమీతుమీ తేల్చుకోనున్న ముంబై-కోల్ కతా
అబుదాబి: ఐపీఎల్ 2020 పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం టాప్ –4లో ఉన్న రెండు జట్లు సీజన్‌లో రెండోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం ఇక్కడి షేక్ జాయెద్ స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించి డిఫెండింగ్ చాంపియన్ ముంబై మంచి ఊపుమీదుంది. మరోపక్క బెంగళూరు చేతిలో 82 రన్స్ తేడాతో చిత్తుగా ఓడిన కోల్‌కతా కాస్త ఒత్తిడిలో ఉంది. పైగా బౌలింగ్ యాక్షన్ వార్నింగ్ ఎదుర్కొన్న సునీల్ నరైన్ వ్యవహారం ఆ జట్టుకు కాస్త తలనొప్పిగా మారింది. కోల్‌కతాలో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో 49 రన్స్ తేడాతో గెలిచిన రోహిత్ సేనే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పైగా, టాప్ క్లాస్ బ్యాటింగ్ లైనప్, డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్‌లు ముంబైకి అడ్వాంటేజ్. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా రెండు హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్..వాటిని అబుదాబిలోనే సాధించాడు. పైగా కోల్‌కతాతో ఆడిన లాస్ట్ మ్యాచ్‌లో 54 బాల్స్‌లో 80 రన్స్ చేయడంతో అతనిపై మళ్లీ భారీ అంచనాలున్నాయి. అతనికి తోడు డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌తో ముంబై లైనప్ అంతా ఫామ్‌లో ఉంది. హార్దిక్, పోలార్డ్ నుంచి జట్టు మరింత ఆశిస్తోంది. బౌలింగ్‌లోనూ ముంబై బలంగా ఉంది. బుమ్రా, ప్యాటిన్సన్ తమ పేస్‌తో చెలరేగుతుంటే, క్రునాల్, రాహుల్ చహర్ స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. నైట్‌రైడర్స్ మాత్రం బ్యాటింగ్‌లో నిలకడ లేమితో ఇబ్బంది పడుతోంది. రాహుల్ త్రిపాఠి, టామ్ బ్యాంటన్ మరోసారి ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్ రాణిస్తున్నా టీమ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌లు చేయలేకపోతున్నారు. మురీ ముఖ్యంగా ఆండ్రీ రసెల్ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా ఫెయిలవుతున్నాడు. కేకేఆర్ పేసర్లు ఫర్వాలేదనిపిస్తున్నా.. బెంగళూరుతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో భారీగా రన్స్ ఇచ్చారు. వరుణ్ చక్రవర్తికి తోడు కుల్దీప్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే చాన్సుంది.