వెన్నుచూపని వీరుడు సర్వాయి పాపన్న.. ఇవాళ సర్దార్​ సర్వాయి పాపన్న జయంతి

వెన్నుచూపని వీరుడు సర్వాయి పాపన్న.. ఇవాళ సర్దార్​ సర్వాయి పాపన్న జయంతి

‘ఈ యుద్ధాలు వద్దురా కొడుకా.. మనది గీత వృత్తి, అది చేసే బతకాలి’ అని తల్లి అన్నప్పుడు.. “తాటి చెట్టు ఎక్కితే ఏమొస్తదమ్మా.. ముంత కల్లు తప్ప, కొడితే గోల్కొండను కొట్టాలి, రాజై పాలించాలి” అని అన్నాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. 1650 ఆగస్టు18న ప్రస్తుత స్టేషన్​ఘన్​పూర్​నియోజకవర్గం ఖిలాషాపూర్​లో జన్మించిన పాపన్న గౌడ్​ అసాధారణంగా ఎదిగి చరిత్ర సృష్టించాడు. తల్లి సర్వమ్మ, తండ్రి ధర్మన్న గౌడ్. ఊరికి పెద్ద అయిన ధర్మన్న గౌడ్​ ధర్మం వైపు నిలబడ్డందుకు స్థానిక దొరల చేతిలో హతమయ్యాడు. పాపన్నకు చిన్నప్పటి నుంచే పోరాట స్ఫూర్తి ఎక్కువ. ఆయన కల్లు మండవలో ఉన్నప్పుడు అప్పటి మొఘల్ సైనికులు అపహాస్యం, అవహేళన చేసేవారు. ఓ సైనికుడు తన మిత్రుడిని ఒకసారి అకారణంగా కాలితో తన్నబోయినప్పుడు.. ఆవేశం ఆపుకోలేక పాపన్న గీత కత్తితో ఆ సైనికుడి మెడ కోశాడు. అక్కడ మొదలైన తన గెరిల్లా యుద్ధం గోల్కొండ కోటకు చక్రవర్తి అయ్యే వరకు సాగింది. 

తన స్నేహితులు చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహెబ్ ఇలా12 మంది స్నేహితులతో పాపన్న మొదలు పెట్టిన గెరిల్లా సైన్యం.. అటు స్థానిక దొరల, జమీందార్ల, ఇటు మొఘల్ సైనికులపై దాడులు చేశాడు.  గడీల దొరల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేవాడు. పాపన్న పేరు, ప్రఖ్యాతులు ఊరూరా పాకి, యువత పెద్ద ఎత్తున పాపన్న సైన్యంలో చేరింది. 12 మందితో మొదలైన గెరిల్లా సైన్యం12,000కు పెరిగింది. మొదట సర్వాయిపేట కోటను ఆక్రమించి, క్రమంగా.. తాటికొండ, కొలనుపాక, చేర్యాల, హుస్నాబాద్, హుజూరాబాద్, బోనగిరి, వరంగల్, కోట సహా1678-–80 వరకు దాదాపు 20 కోటలను కైవసం చేసుకున్నాడు. చివరకు గోల్కొండను కూడా ఆక్రమించి 7 నెలలు పాలించి చరిత్రలో నిలిచాడు. తన పోరాట జీవితంలో సాగిన కొన్ని ముఖ్య ఘటనలు చూస్తే పాపన్న యుద్ధ, దౌత్య నీతి, సమయస్ఫూర్తి అర్థమవుతాయి. 

మొదట1675లో తన సొంత గ్రామం షాపూర్(ప్రస్తుత ఖిలాషాపూర్)లో ఖిలా కట్టి, తన రాజ్య విస్తరణకు పునాది వేశాడు. ఔరంగజేబ్ మరణానంతరం గోల్కొండపై కుతుబ్​షాహీల పాలన, తుర్కుల పాలన బలహీన పడినప్పుడు మొహర్రం రోజున వరంగల్ కోటపై దండయాత్ర చేసి, కైవసం చేసుకొని తన యుద్ధ నీతిని నిరూపించుకున్నాడు. అలాగే ఎంతో బలీయమైన బోనగిరి కోటను చుట్టుముట్టి, దిగ్బంధం చేసి ఆ కోట ఫోయూజిదార్ సోదరిని పెళ్లాడి, బోనగిరి కోటను కైవసం చేసుకున్నాడు. వరంగల్ కోట కైవసం తర్వాత, అపారమైన సంపద పాపన్న హస్తగతమైంది. ఔరంగజేబ్ పాపన్నను మట్టుబెట్టాలని రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పచెప్పాడు. అతడు యూసుఫ్ ఖాన్ కు ఆ బాధ్యత ఇస్తే యూసుఫ్.. ఖిలాషాపూర్ కోటను దిగ్బంధించాడు. చివరకు యూసుఫ్ ఖాన్ ఆ యుద్ధంలో పాపన్న చేతిలో హతమయ్యాడు. తదుపరి హైదరాబాద్ డిప్యూటీ గవర్నర్ అయిన రుస్తుం దిల్ ఖాన్ పాపన్నను 30,000 సైన్యంతో ముట్టడిస్తాడు. దాదాపు3 నెలలు సాగిన ఆ యుద్ధం ఎటూ తేలని సందర్భంలో పాపన్న దిల్ ఖాన్ కు కొంత సంపద ఇచ్చి వెనుతిరిగేలా చేస్తాడు. సామ, దాన, భేద, దండోపాయాల్లో దాన ప్రయోగం చేస్తాడు.

చివరి వరకూ పోరాడి..

ఔరంగజేబ్ తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా1తో పాపన్న సంప్రదింపులు జరిపి తనను రాజుగా గుర్తిస్తే.. కప్పం కట్టడానికి తాను సిద్ధం అని నమ్మించి రాజ ముద్ర వేయించుకున్నాడు. ఆ తర్వాత 6 నెలల్లో పాపన్న తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని, ఢిల్లీకి కప్పం కట్టుడు ఆపేస్తాడు. ఢిల్లీ మొఘల్స్ మధ్య అధికార పోరుతో బలహీన పడ్డ పాలనను చూసి, పాపన్న గోల్కొండను ఆక్రమించి 7 నెలలు పాలిస్తాడు. ఆ 7 నెలల పాలనలో వరంగల్ నుంచి గోల్కొండ వరకు ఉన్న తన రాజ్యంలో అనేక సంస్కరణలు అమలు చేశాడు. బహుజనులకు ముఖ్య పదవులు,  జమిందారులతో సమానంగా అక్కడక్కడ బహుజన భూస్వాములకు ప్రోత్సాహం ఇచ్చాడు. తక్కువ కులం వాడు రాజుగా ఉండటం జీర్ణించుకోలేని వంశపారంపర్య జమీందారులు, ఇతర ప్రాంతాల ఫోయూజిదారులందరూ ఢిల్లీ బాట బట్టి, మొఘల్ చక్రవర్తిపై ఒత్తిడి తెచ్చి, ఎట్టి పరిస్థితుల్లో పాపన్నను తుదముట్టించాలని పట్టుబట్టారు. అటు ముస్లిం చక్రవర్తి బహదూర్ షా సైన్యం, ఇటు హిందూ జమీందారులు, దొరలు, నాయక సేన అందరూ కలిసి గోల్కొండను దిగ్బంధించారు. 1709 చివరిలో మొదలైన యుద్ధం1710 ఏప్రిల్ వరకు కొనసాగింది. సర్దార్ పాపన్న చివరి వరకు శత్రు సైన్యంతో పోరాడాడు. కానీ తన బావమరిది కుట్ర వల్ల బందీ అయ్యాడు. చివరకు1710 ఏప్రిల్ లో పాపన్న శిరచ్ఛేదం చేసి, ఢిల్లీలోని బహదూర్ షా1 పంపుతారు. దాదాపు 30 ఏండ్లు జరిగిన సామాజిక పోరాటం, స్థాపించిన బహుజన సామ్రాజ్యం అప్పటితో అస్తమించింది. 

చారిత్రక సాక్ష్యాలు..

సర్వాయి పాపన్నగౌడ్​ పోరాటానికి సంబంధించి ఎన్నో సజీవ సాక్ష్యాలు నేటికీ ఉన్నాయి. ఆయన స్వయంగా నిర్మించిన ఖిలాషాపుర్, తాటికొండ కోట, వేములకొండ కోటలు, స్థాపించిన హుస్నాబాద్ పట్టణం, ఎల్లమ్మ గుడి, నిర్మించిన చెక్ డ్యాంలు నేటికీ ఉన్నాయి. గోల్కొండ కోటలో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడి సాక కూడా అప్పటిదే. అక్కడ మొదటి బోనం గౌడ సామాజిక వర్గం పాపన్నకు నివాళులుగా సమర్పిస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న జానపద కథలు, గేయాలు అనేకం ఉన్నాయి.1874లో జేఏ బోయల్ అనే ఇంగ్లీష్ చరిత్రకారుడు రికార్డు చేసిన7 పాయల రాజు అనే బుర్ర కథలు, దూళ్మిట్ట వీరగల్లు శాసనంలో “బండిపోత గౌడ షాపూర్ ఖిలా పులి గౌడ, యాబది రోద్దీ, షబ్బారాయద, ఫోదౌర్ పాపన్న గౌడ” అని ఉన్న వాక్యం ఓ సజీవ సాక్ష్యం. కేంబ్రిడ్జి యూనివర్సిటీ పాపన్నపై అధ్యయనం చేయించి.. ఆయన ముఖ చిత్రంతో పుస్తకాన్ని(ది న్యూ కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ డెక్కన్) ముద్రించింది. విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సర్వాయి పాపన్న శిలా విగ్రహం ఉంది. చరిత్రకారులు బార్బారా, రాబర్ట్ మేట్ క్లిప్ పాపన్నను “రాబిన్ హుడ్ ఆఫ్ డెక్కన్” గా అభివర్ణిస్తే, రిచర్డ్ ఈటోన్ “సామాజిక బందిపోటు” అని పేర్కొన్నారు. పాపన్న చరిత్రను నేటి తరానికి అందించిన పేర్వారం జగన్నాథం, మాజీ డీజేపీ పేర్వారం రాములుకు ఈ తరం రుణపడి ఉంటది. 

పాపన్న స్ఫూర్తితో కదులుదాం..

తన తండ్రి సైన్యాధిపతిగా ఉన్న శివాజీ మహారాజ్ మరాఠాలో మొఘలాయులపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు, కానీ ఏ నేపథ్యం లేని పాపన్న, ఒక సాధారణ గీత కార్మికుడు కూడా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. ఇద్దరూ గెరిల్లా యుద్ధ నీతినే రాజ్యాన్ని స్థాపించడానికి అవలంబించారు. శూద్రులు కావడంతో శివాజీని ‘రాజుగా’ కిరీట ధారణ కార్యక్రమానికి అక్కడ బ్రాహ్మణులు అడ్డుపడ్డారు. ఇక్కడ ఒక బహుజన కులస్తుడు రాజుగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక, ఎదిరించి పోరాడలేక దొరలు, జమీందారులు, మొఘలాయుల దగ్గర జీ హుజూర్ అని వెన్నుపోటు పొడిచారు. మొఘలాయులు, కుతుబ్ షాహీలు, నిజాంలు, వలసవాదులు.. నేడు కల్వకుంట్ల పాలన, ఇలా పాలనా ఏదైనా స్థానికంగా అప్పుడు గడి, ఇప్పుడు రాజకీయ గడిని ఛేదించే తరుణం ఆసన్నమైంది. వీరందరూ పరాయి పాలకులు ‘తెలంగాణ సంపదను’ దోచుకోవడం వీరి నైజం. నాడు గడీల దొరలు, నేడు రాజకీయ దొరలు తెలంగాణ ప్రజలను అణచివేస్తూ.. దోచుకుంటున్నారు. నాడు బరిసెలు, ఫిరంగులు.. నేడు పోలింగ్ బూత్​లు, బ్యాలెట్స్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో, తెలంగాణను విముక్తి చేసి, ప్రజాస్వామిక తెలంగాణను స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది. కత్తులు, కఠారులు అక్కరలేదు, బరిసెలు, బుల్లెట్లు అక్కరలేదు, ఒక్క ఓటు చాలు. ఒకే ఒక్క ఓటు కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలు, ప్రలోభాలకు అతీతంగా నేటి తెలంగాణ అణచివేతకు వ్యతిరేకంగా వేస్తే నలుగురి తెలంగాణ నుంచి నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ సుసాధ్యం అవుతుంది.

- డా.బూర నర్సయ్య గౌడ్,
మాజీ ఎంపీ, భువనగిరి