నామినేషన్ల విత్ డ్రాకు ఇయ్యాల్నే (అక్టోబర్ 24) లాస్ట్.. మధ్యాహ్నం 3 వరకు చాన్స్

నామినేషన్ల విత్ డ్రాకు  ఇయ్యాల్నే (అక్టోబర్ 24) లాస్ట్..  మధ్యాహ్నం 3 వరకు చాన్స్
  • ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా రిలీజ్
  • క్యాండిడేట్లకు గుర్తులు కేటాయింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల విత్ డ్రాకు శుక్రవారం (అక్టోబర్ 24) ఒక్కరోజు మాత్రమే చాన్స్ ఉంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకోవచ్చు. గురువారం ఒక్కరు కూడా నామినేషన్లు విత్ డ్రా చేసుకోలేదు. మొత్తం 211 మంది అభ్యర్థుల నుంచి 321 సెట్ల నామినేషన్లు వచ్చాయి. 

ఇందులో 81 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. సరైన పత్రాల్లేని 130 మందికి సంబంధించిన 186 నామినేషన్లని రిజెక్ట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా రిలీజ్ చేస్తారు. అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయిస్తారు. వచ్చేనెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనున్నది.

ఈవీఎంలతోనే ఎన్నికలు: ఆర్వీ కర్ణన్

ఎంతమంది అభ్యర్థులున్నా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్స్ తో ఓటింగ్ ఉండదని తెలిపారు. 64 మంది అభ్యర్థులు దాటితే ఎం3 ఈవీఎంలు ఉపయోగిస్తామన్నారు. ఎం3 ఈవీఎంలకు ఒకేసారి 24 బ్యాలెట్ యూనిట్లను కనెక్ట్ చేసే అవకాశం ఉంటుందని, ఎంత మంది బరిలో ఉన్నా ఈవీఎం ద్వారానే ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు. 

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నారు. ఎవరైనా ట్యాంపరింగ్ చేయాలని చూస్తే వెంటనే పనిచేయడం ఆగిపోతాయని తెలిపారు. ఈవీఎంలలో సెల్ఫ్ డయాగ్నొస్టిక్ ఫీచర్ ఉండటంతో వాటికవే కంట్రోల్ చేసుకుంటాయని, జీపీఎస్ కూడా ఉండటంతో ఈవీఎంలను ఎత్తుకెళ్లడానికి అవకాశం ఉండదని చెప్పారు. హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటంతో వీటిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తుందన్నారు. నిజామాబాద్ లోక్​సభ ఎన్నికలకు ఇవే ఈవీఎంలను ఉపయోగించారు.