ఇవాళ (జనవరి 30) బార్ కౌన్సిల్ ఎన్నికలు.. ఉదయం 10.30 నుంచి 5 గంటల వరకు ఓటింగ్

ఇవాళ (జనవరి 30) బార్ కౌన్సిల్ ఎన్నికలు.. ఉదయం 10.30 నుంచి 5 గంటల వరకు ఓటింగ్

ఓల్డ్​సిటీ, వెలుగు: తెలంగాణ బార్​కౌన్సిల్​ఎన్నికలు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. మొత్తం 25 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా ఈ ఎన్నికల్లో 23 మందికి ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇందులో 18 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉంటారు. మరో ఇద్దరు మహిళలను కో ఆప్షన్​మెంబర్స్​గా నామినేట్​చేస్తారు. 

రెండేండ్లకోసారి జరగవలసిన ఎన్నిక 8 ఏండ్లుగా జరగకపోవడంతో ఈసారి భారీ పోటీ నెలకొన్నది. దీని కోసం ఏకంగా ఈసారి 203 మంది న్యాయవాదులు బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 93 బార్​అసోసియేషన్లలోని 116  పోలింగ్​ కేంద్రాల్లో దాదాపు 35, 316 మంది అడ్వొకేట్లు ఓటు వేయన్నారు. 

ఇలా ఓటెయ్యాలి 

పోలింగ్ ఆఫీసర్​ఇచ్చిన బ్యాలెట్ పేపర్, పెన్నుతోనే ఓటు వేయాలి. ఇతర పెన్నులు వాడితే దాన్ని చెల్లని ఓటుగా పరిగణిస్తారు.  పోటీ చేస్తున్న అభ్యర్థికి ఎదురుగా ఇచ్చిన గడిలో వన్​, టు, త్రీ అని ఇంగ్లీషులోనే రాయాల్సి ఉంటుంది.  ఒక్క ఓటరు కనీసం ఐదు నంబర్ల వరకు రాయాలి. గరిష్టంగా 23 వరకు ఓట్లు వేయవచ్చు. 

ఒకటి నుంచి ఐదు వరకు వరుస క్రమంలో రాస్తూ మధ్యలో ఏదైనా నంబర్​మిస్​చేస్తే మిస్​చేసిన నంబర్​నుంచి తర్వాత నంబర్లను పరిగణలోకి తీసుకోరు. వన్​నంబర్​తప్పనిసరి అది లేకుండా టూ, త్రీ రాసినా ఓటు చెల్లదు. ఒక నంబర్​ను ఒక్కరికే ఇవ్వాలి. రైట్​, రాంగ్​అంటూ టిక్​మార్కులు, సంతకాలు, వేలిముద్రలు పెట్టొద్దు. 

స్పెల్లింగ్​తప్పు రాసినా ఓటును సరైనదిగా పరిగణించరు.  ప్రధాన ఎన్నికల అధికారిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎతిరాజు, సహాయ ఎన్నికల అధికారిగా కవిత యాదవ్​, దీపక్​పర్యవేక్షించనున్నారు. బీసీ సామాజిక న్యాయం అంటూ ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.