హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంగళవారం ఒక్క రోజే గడువు మిగిలి ఉంది. అర్ధరాత్రి వరకు సుమారు వంద కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో రూ. 2,390 కోట్ల పన్ను వసూలైంది. ఇందులో సీఎంసీ రూ. 955 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, జీహెచ్‌ఎంసీ రూ. 907 కోట్లతో రెండో స్థానంలో, ఎంఎంసీ రూ. 528 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.
ముగియనున్న ఓటీఎస్ గడువు
మొండి బకాయిల వసూళ్ల కోసం ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) స్కీమ్ గడువు కూడా మంగళవారంతో ముగియనుంది. ఈ పథకం కింద బకాయిలపై వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తున్నారు. గడువు ముగుస్తున్న నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. భారీగా పన్నులు పెండింగ్‌లో ఉన్న సుమారు 80 ఆస్తులను ఇప్పటికే సీజ్ చేశారు.
రేపటి నుంచి ఎర్లీ బర్డ్
పాత బకాయిల గడువు ముగిసిన వెంటనే, బుధవారం (ఏప్రిల్ 1) నుంచి ఎర్లీ బర్డ్ స్కీమ్ అందుబాటులోకి రానుంది. 2026-–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగానే చెల్లించే వారికి 5 శాతం రాయితీ లభిస్తుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ అవకాశం ఉంటుంది. ఆన్లైన్ లేదా సీఎస్సీ సెంటర్ల ద్వారా పేమెంట్ చేసే వారికి కూడా ఈ రీబేట్ వర్తిస్తుంది. ఈ ఏడాది ఎర్లీ బర్డ్ స్కీమ్‌ను మూడు నెలల పాటు కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒక్కో నెలకు ఒక్కో రకమైన ఆఫర్ ఇచ్చే అవకాశం ఉండగా, దీనిపై నేడు స్పష్టత రానుంది.
పన్ను కట్టని పెట్రోల్ బంక్..చెత్త ఆటోలతో షాకిచ్చిన ఆఫీసర్లు
తాండూర్, వెలుగు: మొండి బకాయిదారుల నుంచి పన్ను వసూళ్లే లక్ష్యంగా తాండూర్అధికారులు వినూత్న పద్ధతిని మొదలుపెట్టారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇలాహి పెట్రోల్ పంపు నిర్వాహకులు గత ఐదేండ్లుగా నోటీసులు ఇస్తున్నా స్పందించకుండా రూ. 82 వేల పన్ను బాకీ పడ్డారు. దీంతో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది సోమవారం చెత్తతో కూడిన వాహనాలను పెట్రోల్ పంపు చుట్టూ అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.
దీంతో బంక్ యాజమాన్యం దిగొచ్చి రెండ్రోజుల్లో పన్ను చెల్లిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మొండి బకాయిదారులు ఎంతటి వారైనా పన్ను వసూలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పన్నులు చెల్లించని వారిపై ఇలాంటి ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
