హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవాళ తెల్లవారుజామున నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, కోఠి, ఉప్పల్‌, నాగోల్‌లో చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం మరింత ఎక్కవ కావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రం‌లోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.  ఉత్తర–‌ద‌క్షి‌ణ‌ద్రోణి తూర్పు విద‌ర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించి, సముద్ర మట్టా‌నికి 0.9కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు కొన‌సా‌గు‌తుందని వాతా‌వ‌రణ కేంద్రం వెల్లడిం‌చింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తు‌న్నా‌యని చెప్పింది. 

వర్షం సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతా‌వ‌రణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలంటాయని అలర్ట్ చేశారు.  ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ వారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.