ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో టాలీవుడ్ కీలక భేటీ

ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో టాలీవుడ్ కీలక భేటీ
  • 240 మంది పెద్దలకు ఆహ్వానాలు

హైదరాబాద్: ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో టాలీవుడ్ నేతల కీలక సమావేశం జరుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి 240 మంది టాలీవుడ్ పెద్దలకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. సమావేశంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు హాజరవుతున్నారు. సినిమా సమస్యల పై ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయిన తర్వాత జరుగుతున్న 
ఈ కీలక సమావేశం ఉత్కంఠ రేపుతోంది. సమావేశంలో సినీ పరిశ్రమ సమస్యలు, సిని కార్మికుల వెల్ఫేర్ పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమావేశానికి హాజరు అవుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తమ్మారెడ్డి భరధ్వాజ, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మైత్రీ మూవీస్ రవి ,నవీన్  బివిఎస్ఎసన్ ప్రసాద్ , స్రవంతి రవికిషోర్, ముత్యాల రాందాస్ ,మాదాల రవి,  తుమ్మలపల్లి రామసత్యనారాయణ  తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది. 
సమావేశం గురించి ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అంతర్గత సమస్యలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నామని తెలిపారు. పరిశ్రమ సంబంధిత అన్ని వ్యవస్దల సభ్యులను ఆహ్వానించామన్నారు. గత రెండేళ్ళు గా చిత్ర పరిశ్రమలో ఎన్నో ‌మార్పులు, సమస్యలు వచ్చాయి, వాటిపై సమీక్ష కొరకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. గంటన్నర పాటు అన్ని విషయాలపై చర్చించుకోనున్నాము. ఇది చిత్ర పరిశ్రమ మంచి కోసం చేసుకుంటున్న సమీక్ష కాబట్టి అందరినీ ఆహ్వానించామన్నారు.  
నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ నిర్మాత ఆదిశేషగిరిరావు గారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు 
రిప్రజెంట్ చేసే విషయాలపై చర్చించనున్నామన్నారు. వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని కలిసినా, ఛాంబర్ ఆద్వర్యంలో జరిగేదె ఇండస్ట్రీ సమావేశం అన్నారు. ఇండస్ట్రీ అంటే ఏ ఒక్కరో, ఇద్దరో వ్యక్తులు కాదని వివరించారు. చిన్న సినిమా సమస్యలపై ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు.