సినిమా క్యారెక్టరే ఆయన ఇంటి పేరైంది

సినిమా క్యారెక్టరే ఆయన ఇంటి పేరైంది

మొదటి సినిమా లేదా పేరు తెచ్చిన సినిమా ఇంటి పేరుగా మార్చుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. అయితే ఒక పాత్ర మేనరిజమ్‌ను ఎవరైనా ఇంటి పేరుగా మార్చుకుంటారా? కానీ ఆయన విషయంలో అదే జరిగింది. సినిమాలోని క్యారెక్టరైజేషన్ ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అదే ఆయనకి సర్‌‌ నేమ్ అయ్యింది. ఆ నటుడు ఎవరో కాదు.. సుత్తి వేలు. తనదైన టైమింగ్‌తో టాలీవుడ్ టాప్ కమెడియన్స్ ల్లో ఒకరిగా వెలిగిన వేలు జయంతి సందర్భంగా ఇవాళ ఆయన గురించిన కొన్ని విశేషాలు..

సుత్తి వేలు అసలు పేరు..

సుత్తి వేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. 1947లో కృష్ణా జిల్లాలోని భోగిరెడ్డి పల్లెలో జన్మించారు. చిన్నతనంలో ఆయన బాగా బక్క పల్చగా ఉండేవారట. కానీ విపరీతమైన అల్లరి చేసేవారట. దాంతో పక్కింటావిడ ఏడిపించడానికి వేలెడంత లేవు నువ్వు అంటూనే వేలు వేలు అని పిలవడం మొదలుపెట్టిందట. ఆ తర్వాత అందరూ అలాగే పిలుస్తుండటంతో అదే ఆయన ముద్దు పేరుగా స్థిరపడిపోయింది. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి ఏర్పడటంతో ఏడో ఏటనే మేకప్ వేసుకున్నారు వేలు. తమ ఊళ్లో జరిగిన ఓ డ్రామాలో నటించారు. అయితే టీచర్‌‌ అయిన తండ్రి అది ఇష్టపడలేదు. అన్నీ కట్టిపెట్టి బుద్ధిగా చదువుకోమన్నారు. కానీ మనసంతా నటనపైనే ఉండటంతో వేలు వినలేదు. అలాగని చదువునీ నిర్లక్ష్యం చేయలేదు. పీయూసీ చేసి హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత బాపట్లలో మరో ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లు చేసిన తర్వాత దాన్ని కూడా వదిలేసి నాటకాలపై దృష్టి పెట్టారు. చివరికి వైజాగ్ డాక్ యార్డ్ లో పర్మినెంట్ జాబ్ రావడంతో అక్కడికి మకాం మార్చేశారు. అప్పుడు కూడా నాటకాలను మాత్రం వదల్లేదు.

అలా చాలామంది ఆయనకి అభిమానులయ్యారు..

‘అంతా ఇంతే’ అనే నాటకం వేలుకి మంచి పేరు తీసుకొచ్చింది. ‘మనిషి నూతిలో పడితే’ అనే నాటకం చూసి చాలామంది ఆయనకి అభిమానులయ్యారు. జంధ్యాల కూడా అది చూసే తన ‘ముద్దమందారం’ మూవీలో రిసెప్షనిస్టు పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మల్లెపందిరి, నాలుగు స్తంభాలాట సినిమాలకి కూడా తీసుకున్నారు. నాలుగు స్తంభాలాట చిత్రం ఆలస్యం కావడంతో ఆయన ఉద్యోగం పోయింది. అయినా బాధ పడలేదు. ఇక నటననే తన ప్రొఫెషన్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆనంద భైరవి, రెండు జళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి లాంటి జంధ్యాల సినిమాలు ఆయన్ని బిజీ కమెడియన్‌ని చేశాయి. దాదాపు ఇరవై సినిమాలు ఆయన డైరెక్షన్‌లో చేశారు వేలు.

వేలు నట విశ్వరూపాన్ని చూడొచ్చు..

మొదట్లో అందరి పెదాలపై నవ్వులు పూయించినా.. ఉండేకొద్దీ తనలోని సీరియస్ నటుణ్ని కూడా బైటికి తీశారు వేలు. ‘ప్రతిఘటన’లో పిచ్చివాడైపోయిన కానిస్టేబుల్‌ పాత్ర చూస్తే ఆయన కడుపుబ్బ నవ్వించడమే కాదు, కంటతడి కూడా పెట్టించగలడని అర్థమవుతుంది. ఇంకా వందేమాతరం, ఈ పిల్లకి పెళ్లవుతుందా, ఈ చదువుకు మాకొద్దు, కలికాలం, ఒసేయ్ రాములమ్మ లాంటి ఎన్నో చిత్రాల్లో వేలు నట విశ్వరూపాన్ని చూడొచ్చు. అయితే సీరియస్ పాత్రలు చేయడం వల్ల ఆయనకి కమెడియన్ రోల్స్ తగ్గాయని కూడా అంటుంటారు. ఏదేమైనా అటు కమెడియన్‌గాను, ఇటు సీరియస్ యాక్టర్‌‌గాను కూడా ఫుల్ మార్కులు వేయించుకున్నారు వేలు. ‘వందేమాతరం’లోని పాత్రకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌‌గా.. దేవాలయం, గీతాంజలి, మాస్టారి కాపురం చిత్రాల్లోని పాత్రలకు బెస్ట్ కమెడియన్‌గా నాలుగుసార్లు నంది పురస్కారం వరించిందంటేనే ఆయన ఎంత గొప్ప నటుడో అర్థం చేసుకోవచ్చు.

నాటి నుంచి ఆయన సుత్తి వేలు అయ్యారు..

‘నాలుగు స్తంభాలాట’లో సుత్తి కొట్టే పాత్ర సూపర్‌‌ హిట్ కావడంతో వేలు పేరు ముందు సుత్తి చేరింది. నాటి నుంచి ఆయన సుత్తి వేలు అయిపోయారు. సుత్తి వీరభద్రరావు విషయంలోనూ అదే జరిగింది. అందుకే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ప్రత్యేక కామెడీ ట్రాక్స్ ప్లాన్ చేసేవారు దర్శకులు. ఇద్దరూ కలిసి యాభై సినిమాల వరకు చేశారు. కామెడీ బాగా పండాలని డబ్బింగ్ కూడా కలిసే చెప్పేవారిద్దరూ. వీరభద్రరావు ఇచ్చిన సలహాలు, సూచనలు తనను నటుడిగా మరింత బెటర్ చేశాయని వేలు పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన చనిపోయాక చాలా డల్ అయిపోయారు వేలు. దానికి తోడు జంధ్యాల సినిమాలు తగ్గడం, తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి షిఫ్టవడం వంటివి ఆయన కెరీర్‌‌ని మరింత డల్ చేశాయి. భార్యని, ముగ్గురు కూతుళ్లని, ఒక కొడుకుని పోషించడం కోసం సీరియల్స్ లోనూ నటించారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుని 2012లో కార్డియాక్ అరెస్ట్తో చనిపోయే వరకు నటిస్తూనే ఉన్నారు. ‘రామాచారి’ చిత్రమైతే ఆయన చనిపోయాక విడుదలయ్యింది.

సూపర్బ్ యాక్షన్.. డైలాగ్ డెలివరీలో పర్‌‌ఫెక్షన్.. నటనలో డిసిప్లిన్‌ ఉన్న వేలు లాంటి నటులు వేళ్ల మీద లెక్క పెట్టేంతమందే ఉంటారు. నటననే ప్రేమించి, నటనలో జీవించి, నటిస్తూనే మరణించిన గొప్ప వ్యక్తి ఆయన. అందుకే వేలుని, తెలుగు సినిమా హాస్యానికి ఆయన చేసిన మేలుని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు.