ఫ్రెండ్ చనిపోయిన తర్వాత బర్త్ డే చేసుకోవడం మానేశాడు 

ఫ్రెండ్ చనిపోయిన తర్వాత బర్త్ డే చేసుకోవడం మానేశాడు 

‘అల్లరి’తో కడుపుబ్బ నవ్వించాడు. 'కితకితలు' పెట్టి కామెడీకి కేరాఫ్‌గా మారాడు. ‘నేను’  కాస్త డిఫరెంట్ అంటూ ప్రేక్షకుడిని కంటతడి పెట్టించాడు. ఫేమస్ దర్శకుడి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. కెరీర్‌‌ను మాత్రం అంత ఈజీగా తీసుకోలేదు. కష్టపడ్డాడు.. బెస్ట్ ఇవ్వాలని ప్రతిక్షణం తపించాడు. అతనే అల్లరి నరేష్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన లైఫ్‌ జర్నీలోని కొన్ని ఇంటరెస్టింగ్‌ విషయాలపై వీ6 వెలుగు స్పెషల్ స్టోరీ.

1982 జూన్ 30న డైరెక్టర్ చెన్నైలో పుట్టాడు నరేష్. తండ్రి ఇ.వి.వి.సత్యనారాయణ ఫేమస్ డైరెక్టర్, తల్లి సరస్వతి గృహిణి. నరేష్ స్కూలింగ్ పూర్తైన తర్వాత వాళ్ల కుటుంబం హైదరాబాద్‌కి షిఫ్టయింది. తండ్రి డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కావడంతో  సినిమా వాతావరణం తనకు పరిచయమే. నాన్న పెద్ద దర్శకుడే అయినా ఆయన సినిమాతో లాంఛ్ అవ్వలేదు నరేష్.  రవిబాబు తీసిన ‘అల్లరి’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సన్నగా, రివటలా ఉన్నా.. నరేష్ పండించిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో ఆ సినిమా పేరే నరేష్ ఇంటి పేరుగా మారిపోయింది. 

స్పూఫ్లకు కేరాఫ్

మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకోవడంతో నరేష్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.  వెంటనే ధనలక్ష్మి ఐ లవ్యూ, తొట్టిగ్యాంగ్ సినిమా అవకాశాలొచ్చాయి. మా అల్లుడు వెరీ గుడ్, కితకితలు, బ్లేడ్ బాబ్జీ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, బెండు అప్పారావ్ ఆర్‌‌ఎంపీ, సీమ టపాకాయ్‌ తదితర చిత్రాలతో కామెడీకి కేరాఫ్‌గా మారాడు. కామెడీ హీరోల్లో రాజేంద్ర ప్రసాద్‌ తర్వాత అంత పేరు తెచ్చుకున్నాడు. నరేష్ సినిమాల్లో పేరడీలకి ప్రేక్షకులు పట్టం కట్టారు. దర్శకులు నరేష్ నటించే మూవీల్లో ఇతర హీరోల్ని లేదా పలు సినిమాల్లోని పాత్రల్ని, సన్నివేశాల్ని, పాటల్ని పేరడీ చేసేవారు. నరేష్ పర్‌‌ఫార్మెన్స్ తోడై అవి నవ్వులు పూయించేవి. ‘సుడిగాడు’ సినిమాలో అయితే ఏకంగా వంద తెలుగు సినిమాల స్పూఫ్లు ఉన్నాయి.

సీరియస్ పాత్రలకు ప్రాణం

కామెడీ చేసినా నరేష్‌లో ఒక సీరియస్ ఆర్టిస్ట్ ఉన్నాడనే విషయం ప్రేక్షకులకు ఆ తర్వాత అర్థమైంది. ‘నేను’ సినిమాలో కాస్త సైకో లక్షణాలు ఉండే పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే సుందరకాండ, విశాఖ ఎక్స్ ప్రెస్ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేసి తన నట విశ్వరూపం చూపించాడు. ఇక ‘గమ్యం’ సినిమాలో నరేష్ చేసిన పాత్ర అల్టిమేట్. జోవియల్‌గా కనిపిస్తూనే జీవితమంటే ఏంటో చూపించే గొప్ప క్యారెక్టర్ అది. దానికి నరేష్ ప్రాణం పోశారు. అందుకే ఆ పాత్రకి నందితో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వరించింది. ఇక ‘శంభో శివ శంభో’ మూవీలో చేసిన పాత్ర చాలామంది తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తన అన్న ఆర్యన్ రాజేష్‌తో కలిసి నటించిన ‘నువ్వంటే నాకిష్టం’ మూవీలోనూ చాలా ఎమోషనల్ రోల్‌ చేశారు నరేష్.

2015 తర్వాత స్లో అయిన కెరీర్
ఎంత వారికైనా కొంత కష్టాలు తప్పవన్నట్టు.. నరేష్‌ కెరీర్‌‌లోనూ ఒడిదొడుకులు ఉన్నాయి. చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. ఫలితంగా2015 తర్వాత నరేష్ కెరీర్ కాస్త స్లో అయింది. కానీ నటుడిగా మాత్రం ఆయన ఫెయిల్ కాలేదు. ‘మహర్షి’లో మహేష్‌ ఫ్రెండ్‌ పాత్రలో మరోసారి తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత ‘నాంది’ సినిమాతో మరోసారి సత్తా చాటారు. 


కొన్ని సినిమాల్లో కామియో అప్పియరెన్సులు కూడా ఇచ్చారు. మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, బొమ్మలాట, చందమామ కథలు, సూపర్‌‌స్టార్ కిడ్నాప్‌ చిత్రాల్లో కొద్ది నిమిషాల పాటు మెరిశారు. ఇక సందీప్ కిషన్ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌’కి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు నరేష్. 

2009లో విరూపతో పెళ్లి
గతంలో ఒకసారి ఓ హీరోయిన్‌తో, ఆ తర్వాత ఒక న్యూస్ రీడర్‌‌తో నరేష్ పేరు ముడిపెడుతూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని తర్వాత తేలింది. 2009తో నరేష్ విరూప అనే అమ్మాయి మెడలో మూడుముళ్లు వేశాడు. వారికి ఓ పాప. కూతురంటే నరేష్‌కి ప్రాణం. నరేష్‌కు చిన్నప్పట్నుంచీ ఆటలంటే చాలా ఇష్టం. షెటిల్, క్రికెట్ ఆడేవారు. బాగా హైట్ ఉండటంతో తనని బాస్కెట్ బాల్‌ టీమ్‌లోకి కూడా తీసుకున్నారు. పెద్దయ్యాక కూడా ఆటలపై ఇష్టం పోలేదు. మాదాపూర్‌‌లో అప్పుడప్పుడు శాండ్ వాలీబాల్ ఆడేవారు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేనప్పుడు రక్తం ఎంత విలువైనదో అర్థమైంది. అందుకు అప్పటి నుంచి ప్రతి 3 నెలలకోసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నాడు. అంతేకాదు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నా వాటి గురించి బయటకు రానివ్వడు. 

ఎమోషనల్ పర్సన్
కామెడీని అద్భుతంగా పండించినా కామెడీ పర్సన్‌ని మాత్రం కాదంటారు నరేష్. అందరితో జోవియల్‌గా ఉంటారట. కానీ ఏ విషయానికైనా చాలా త్వరగా ఎమోషనల్‌ అయిపోతానని అంటుంటారు. నరేష్‌ బెస్ట్ ఫ్రెండ్‌ ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోవడం ఆయనను బాగా కుంగదీసింది. చాలాకాలం ఆ బాధ నుంచి తేరుకోలేకపోయారు. ప్రతి బర్త్ డేకు అతను గ్రీటింగ్ కార్డ్, కేక్ తీసుకుని నరేష్‌ దగ్గరికి వచ్చి విష్ చేసేవాడు. అందుకే అతను చనిపోయిన తర్వాత బర్త్ డేస్ చేసుకోవడం మానేశాడు. 

డైరెక్షన్ చేసే ఆలోచన

ప్రస్తుతం నటనపైనే దృష్టి పెట్టినా.. ఫ్యూచర్‌‌లో డైరెక్షన్‌ కూడా చేయాలన్నది నరేష్ ఆలోచన. ఎప్పుడు, ఎలా అనేది చెప్పలేను కానీ.. ఏదో ఒక సమయంలో డైరెక్టర్‌‌ చెయిర్‌‌లో మాత్రం కూర్చుంటానని నరేషే ఒకసారి స్వయంగా చెప్పారు. మంచి నటుడిగానే కాదు.. మంచి వ్యక్తిగానూ నరేష్‌కి పేరుంది. సౌమ్యంగా ఉంటారని, అందరితో కలుపుగోలుగా మెలుగుతారని, కాంట్రవర్శీలకు దూరంగా ఉంటారని ఆయన గురించి అందరూ చెబుతుంటారు. ఆయన ఇండస్ట్రీలో ఎదగడానికి ఆ బిహేవియర్‌‌ కూడా ఓ కారణమే అనేది సన్నిహితులు చెప్పే మాట.  ప్రస్తుతం నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి’ అనే సీరియస్ ఫిల్మ్తో పాటు ‘సభకు నమస్కారం’ అనే సెటైరికల్ ఫిల్మ్ కూడా చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని సినిమాలు చేసి , వర్సటైల్ యాక్టింగ్‌తో మరింతగా మెప్పించాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే నరేష్‌.