నిర్మాత కేపీ చౌదరీ అరెస్టుతో..తెరమీదకు టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్.. పలువురు సెలబ్రిటీల్లో గుబులు

నిర్మాత కేపీ చౌదరీ అరెస్టుతో..తెరమీదకు టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్.. పలువురు సెలబ్రిటీల్లో గుబులు

టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.  డ్రగ్స్ వినియోగిస్తున్న సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీ చౌదరి అరెస్ట్ తో సినీ డ్రగ్స్ లింక్స్ మళ్లీ తెరమీదకు వచ్చాయి. కేపీ చౌదరి అరెస్ట్ తో  పలువురు సెలబ్రిటీల్లో గుబులు మొదలైంది. రోషన్ అనే డ్రగ్స్ ఫెడ్లర్ విచారణలో కేపీ చౌదరీ వ్యవహరం వెలుగు చూసింది. 

హైదరాబాద్లో కేపీ చౌదరీ పలు ప్రైవేట్ పార్టీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కేపీ చౌదరి నుంచి 4 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..అందులో ఉన్న కాల్ డేటా తీస్తున్నారు. కే. పి చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన సెలెబ్రిటీల లిస్ట్ తయారు చేస్తున్నారు. సెల్ ఫోన్ ల డేటా ద్వారా డ్రగ్స్ ముఠాతో  సెలబ్రిటీల లింక్స్ లను పోలీసులు బయటికి తీయనున్నారు. దీంతో ఎవరి పేరు బయటకు వస్తుందో అని టాలీవుడ్ సెలబ్రిటీలు బయపడిపోతున్నారు. 

టాలీవుడ్  నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి జూన్ 13వ తేదీ  మంగళవారం రాత్రి కిస్మత్ పూర్ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొకైన్ అమ్ముతుండగా కె.పి చౌదరిని పట్టుకున్న పోలీసులుతెలిపారు.  అతని వద్ద నుంచి 82.74 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ విక్రయం కేసులో  గోవా డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్  గాబ్రియేల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  పరారీలో ఉన్న నైజీరియన్ పై గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

ఎవరీ కేపీ చౌదరి..

కేపీ చౌదరి 2016 లో సినిమా రంగంలోకి వచ్చాడు. అతడు కబాలి సినిమాకు తెలుగు నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా పలు  తెలుగు, తమిళ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. 

నష్టాల్లో డ్రగ్స్ సరఫరా

సినీ రంగంలో నష్టాలతో కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరాలోకి దిగాడు. ఇందులో భాగంగానే గోవాలో OHM పబ్ ను ప్రారంభించాడు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. పబ్ లో నష్టాలు రావడంతో  కేపీ చౌదరి తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. గోవా నుంచి వస్తూ 100 ప్యాకెట్ల కొకెన్ తీసుకువచ్చాడు. అందులో కొన్నింటిని అతను వినియోగించాడని పోలీసులు వెల్లడించారు.

డ్రగ్స్ కేసు సంచలనం..

2017లో ఎక్సైజ్‌ శాఖ నమోదు చేసిన కేసులతో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం సంచలంన రేపింది. అప్పట్లో  అధికారులు కెల్విన్‌ మార్కెరాన్స్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించడంతో టాలీవుడ్ కు చెందిన  అనేక మంది సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో  సినీ ప్రముఖులను విచారించారు.  దర్యాప్తులో ఎక్సైజ్ అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్‌ పరిశోధనకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా దీనిపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. 

2020లోనూ..

2020 ఆగస్టులోనూ పూరీ జగన్నాథ్‌, రవితేజ, రానా, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, తరుణ్ వంటి 12 మందిని కూడా విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించకపోవడంతో వారందరికీ తెలంగాణ ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎక్సైజ్ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. గతంలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్‌, తరుణ్‌, చార్మీ, నందు, రానా, రవితేజ సహా 11 మంది ప్రముఖులకు  ఈడీ నోటీసులు జారీ చేసింది. ఓవైపు ఈడీ టాలీవుడ్‌ సెలబ్రిటీలను విచారిస్తూండగానే ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో ఎక్సైజ్‌ శాఖ చార్జిషీట్‌ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో కెల్విన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో అనేకమంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికే అలా చెప్పారని ఎక్సైజ్‌ శాఖ కోర్టుకు చెప్పింది. సెలబ్రిటీలకు డ్రగ్స్‌ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవని, నిందితుడు కెల్విన్‌ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జిషీటులో పోలీసులు స్పష్టం చేశారు. వారినుంచి సేకరించిన శాంపిల్స్‌లో డ్రగ్స్‌ ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఎక్సైజ్‌ శాఖ డ్రగ్స్‌ వాడలేదని కోర్టుకు చెప్పినప్పుడు డ్రగ్స్‌ కొన్నారని దాని కోసమే డబ్బు చెల్లించారని ఈడీ నిరూపించడం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే 2021 సెప్టెంబర్లో సినీతారలందిరికీ క్లీన్‌చిట్‌ ఇచ్చారు.