
హైదరాబాద్: ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్(57) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఆయన పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండటంతో వాళ్లు వచ్చేందుకు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో బాడీని మార్చురీకి తరలించారు.
తన మిమిక్రీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హరికిషన్..1963 మే 30న ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు జన్మించారు. 1971లో విజయవాడలో హరికిషన్ తొలి మిమిక్రీ ప్రదర్శన చేశారు. దివంగత మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో మిమిక్రీ రంగంలోకి వచ్చిన హరికిషన్.. పలు సినిమాలు, టీవీ షోల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 12 ఏళ్ల పాటు టీచర్‌గా పనిచేసి, ఆ తర్వాత.. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గా పనిచేశారు.