- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- తొలి సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందర్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: ఇంద్రేశం మున్సిపాలిటీని అందరి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ వార్డు ఆఫీసులో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా పని చేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఐదేళ్లపాటు ప్రతీ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే రూ.15 కోట్లు మంజూరయ్యాయని వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేసుకుందామన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులను అభివృద్ధి పనులకు వినియోగించుకుందామన్నారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రమీల, వైస్ చైర్మన్ హరీశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
