వాడీ వేడిగా మున్సిపల్ మొదటి సమావేశం

వాడీ వేడిగా మున్సిపల్ మొదటి సమావేశం

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం వాడీ వేడిగా కొనసాగింది. మున్సిపల్ చైర్​పర్సన్ యునూస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 36 మంది సభ్యులు పాల్గొన్నారు. ఎజెండాను కమిషనర్ జైత్రామ్ వివరిస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ తంజీమ్ ఎజెండాలోని అంశంపై సందేహాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ నిజామ్ ఆయనకు అడ్డు తగలడంతో వారి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎంపీ కలుగజేసుకుని వారిని శాంతింపజేశారు. అనంతరం చైర్​పర్సన్​యునూస్ మాట్లాడుతూ నిత్యం వార్డుల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వైస్ చైర్​పర్సన్ శిరీష రెడ్డి మాట్లాడుతూ సభ్యులంత ఐక్యంగా ఉండాలని వార్డుల అభివృద్ధే ఎజెండాగా పనిచేద్దామన్నారు.

సభ్యులు రంగా అరుణ్ మాట్లాడుతూ పట్టణంలో ఇళ్ల సంఖ్యకంటే ఇంటి నంబర్లు అధికంగా ఉన్నాయని వాటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఓపెన్ ప్లాట్స్ గుర్తించి కంచె వేసి అక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. సభ్యులు అరుణ్, జహంగీర్ మాట్లాడుతూ మిల్క్ చిల్లింగ్ సెంటర్ వద్ద స్థలం ఎవరిదో గుర్తించాలని కోరారు. సభ్యులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వృధా నీరంతా పస్తాపూర్ మీదుగా వెళ్తున్నదని నారింజలోకి మల్లించాలని కోరారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని, విలీన ప్రాంతాలకు పన్ను సరిచేయాలని కోరారు. నీటి, కాలువ, వీధి దీపాలు, రోడ్ల సమస్యలను సభ్యులు జమీల్, సుజిత, మహేశ్, విజయ, కవిత, దీపక్, తహరా బేగం, నయ్యర్ బేగం, పర్వీన్ బేగం తెలియజేశారు. శాంతినగర్ లో బస్తి దవాఖానను పునరుద్ధరించాలని కోరారు. మార్కెట్ సమీకృత కాంప్లెక్స్ ను అద్దెకు ఇస్తే మున్సిపల్ కు ఆదాయం వస్తుందని సభ్యులు స్రవంతి సూచించారు. బాగారెడ్డిపల్లిలో కరెంట్ లేని ఇళ్లు చాలా ఉన్నాయని మహేశ్ పేర్కొన్నారు. పన్నులు చెల్లించేందుకు సభ్యులు సహకరించాలని కమిషనర్ కోరారు.