
సర్కారు వారి పాట సినిమాతో జోరు మీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సారి ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీజులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ కెరీర్ లో తొలిసారి ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన మే 31న బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జులై రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మహేష్ బాబు బాల నటుడిగా తండ్రి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలో డ్యూయెల్ రోల్ లో నటించాడు. ఆ తర్వాత ఎస్ జే సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన నాని మూవీ క్లైమాక్స్ లో కాసేపు తండ్రీ కొడుకులుగా కనిపించారు. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో పూర్తిస్థాయిలో రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.
ఇక డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ సిద్ధమవుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అధికారి అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీలో చెర్రీ డ్యూయెల్ రోల్ పోషించనున్నట్లు టాలీవుడ్ సర్కిళ్లలో వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రీ కొడుకులుగా చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో త్వరలోనే యాక్షన్ ఎంటర్టైనర్ రానుంది. ఈ సినిమాకు అన్నగారు, జై బాలయ్య టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య యువకుడిగా, వయసు మళ్లిన వ్యక్తిగా కనిపించనున్నాడట. ఎన్బీకే107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను ఇటీవలే రిలీజ్ చేశారు. భారీ బాడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.