తినడం మానేస్తే టమాటా ధరలు తగ్గుతాయి : ప్రతిభా శుక్లా

తినడం మానేస్తే టమాటా ధరలు  తగ్గుతాయి : ప్రతిభా శుక్లా

దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.  ఇప్పటికీ కిలో టమాటాలు రూ. 120 నుంచి 150 పలుకుతోంది. దీంతో టమాటాలు కొనేందుకు జనాలు భయపడిపోతున్నారు . ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు పోషకాహార శాఖ సహాయ మంత్రి  ప్రతిభా శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

టమాటా ధరలు పెరుగుతున్నట్లు అయితే తినడం మానేస్తే అవే తగ్గుతాయని  ప్రతిభా శుక్లా సలహా ఇచ్చారు. అంతేకాకుండా టమాటాలకు బదులుగా నిమ్మకాయాలు వాడుకోవాలని సూచించింది.  అలాగే ప్రజలు ఇంటి వద్దే టమాటా మొక్కలు పెంచుకోవాలని తెలిపింది. యూపీ ప్రభుత్వం చేపట్టిన భారీ చెట్ల పెంపకం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమంలో శుక్లా పాల్గొని మొక్కలు నాటారు.   అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.    

యూపీ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ధరలు తగ్గించడానికి తాము ఏమీ చేయడం లేదని యూపీ ప్రభుత్వం బహిరంగంగానే ఒప్పుకుంటున్నదని ఆరోపించింది.  రుతుపవనాలు ఆలస్యమవడం, సరిపడా ఉత్పత్తి లేకపోవడం, విపరీతమైన వేడి కారణంగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.