రేపు కాంగ్రెస్ పార్టీ నేత‌ల గోదావరి జల దీక్ష

రేపు కాంగ్రెస్ పార్టీ నేత‌ల గోదావరి జల దీక్ష

హైదరాబాద్ : గోదావరి నది పైన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జల యజ్ఞం లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను శనివారం సందర్శించ‌నున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు. వాటి పురోగతితో పాటు సీఎం చంద్రశేఖర్ రావు హ‌యాంలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్షాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ విషయమై ఆయన శుక్రవారంనాడు డీసీసీ అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో ఫోన్ లో మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ లు, నియోజక వర్గ ఇంఛార్జీలు, ఇటీవల ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నాయకులు వారి పరిధులలో ఉన్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లి దీక్షలు చేయాలని తెలిపారు. ఈ సందర్బంగా ప్రాణహిత ప్రాజెక్టు స్థలం ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి పాల్గొంటారు.

గౌరవల్లి రిజర్వాయర్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లు ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్యెల్యే సీతక్క పాల్గొంటారు.

దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎంపీ వి .హనుమంతరావు, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాములు నాయక్, ఎల్లం పల్లి వద్ద కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, ఏఐసిసి సెక్రెటరీ వంశీ చంద్ లు దీక్ష‌లో పాల్గొన‌నున్నారు.‌

అలిసాగర్ ప్రాజెక్టు వద్ద మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కామారెడ్డి సమీపంలో ప్రాణహిత 22వ ప్యాకేజీ భూంపల్లి వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొంటారు.