- భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు పునాదులు వేయడమే నిజమైన నాయకత్వం: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కామెంట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రపంచానికే ఆదర్శమని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన వీడియో మెసేజ్ ద్వారా తన అభిప్రాయం తెలియజేశారు. ‘‘ఒకప్పుడు అనేక కష్టాల్లో ఉన్న తెలంగాణ.. నేడు టెక్నాలజీ, వ్యవసాయం, సమ్మిళిత వృద్ధిలో ఒక శక్తి కేంద్రంగా మారింది.
పదేళ్లలో జీఎస్‌డీపీని మూడు రెట్లు పెంచుకుని ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు రోల్ మోడల్‌గా నిలిచింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న తెలంగాణ లక్ష్యం అభినందనీయం. నాయకత్వం అంటే కేవలం నేటి సమస్యలను పరిష్కరించడమే కాదు.. రేపటి అవకాశాలకు ప్రజలను సిద్ధం చేయడం.
తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా అదే చేస్తోంది. వచ్చే దశాబ్దంలో మెట్రో విస్తరణ, సాగునీటి రంగ ఆధునీకరణ, మహిళా సాధికారత, పారదర్శకమైన పాలన, అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించడం వంటి అంశాల్లో తెలంగాణ గొప్ప శక్తిగా అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా దీర్ఘకాలిక, టెక్నాలజీ ఆధారిత వృద్ధికి పునాదులు వేస్తోంది” అని కొనియాడారు. త్వరలోనే హైదరాబాద్‌కు వస్తానని చెప్పారు.

