
- కొని బ్లాక్ చేసిన వ్యాపారులు
- అవసరం మేరకే బయటకు రిలీజ్
- ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న తాండూరు కందిపప్పు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కందిపప్పు ధరలు భగ్గుమంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. మన రాష్ట్రానికి మహారాష్ట్రలోని లాతూర్ నుంచే కందిపప్పు అధికంగా దిగుమతి అవుతుంది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ నుంచి కూడా కొద్దిమొత్తంలో వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో లాతూర్ కందిపప్పు క్రయవిక్రయాలే ఎక్కువగా జరుగుతుంటాయి. రాష్ట్రంలో తాండూరు చుట్టుపక్కల కూడా కంది బాగా వేస్తారు. ఈ పప్పునకు డిమాండ్ ఉంటుంది.
పంట పెరిగినా ధరలు తగ్గలే..
గత ఏడాదితో పోలిస్తే ఈసారి తాండూరు ప్రాంతంలో కందుల దిగుబడి పెరిగిందని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 30 శాతం పంట అధికంగా వచ్చిందని అంటున్నారు. పోయిన సంవత్సరం తాండూరు మార్కెట్లో క్వింటా కందుల ధర రూ.12 వేల వరకు పలికింది. అయితే ఈ సారి వ్యాపారులు క్వింటాకు 10 వేల లోపే ధర పెట్టి కొన్నారు. కానీ రిటైల్ మార్కెట్లో కందిపప్పు ధర మండిపోతున్నది.
మార్కెట్లో క్వింటా కందులు 12 వేలు పలికినప్పుడు రిటైల్‌గా కిలో పప్పు ధర రూ.140 నుంచి 160 మధ్య కదలాడింది. కానీ క్వింటా కందుల ధర మార్కెట్ లో 10 వేలు మాత్రమే పలుకుతున్న ఈ టైమ్‌లో రిటైల్‌గా కంది పప్పు ధర రూ.180 నుంచి 200 వరకు ఉంది. కొందరు హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు భారీగా కందిపప్పును ముందే కొని పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టించడమే అధిక రేట్లకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద వ్యాపారులు అవసరం మేరకే కందిపప్పును బయటకు రిలీజ్చేస్తూ రేట్లను కంట్రోల్ చేస్తున్నారని చిరువ్యాపారులు అంటున్నారు.