లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం

లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం

షోపియాన్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో సోమవారం ఓ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారు. వీరిలో లష్కరే తొయిబాకు చెందిన ఇష్ఫాక్ దార్ అలియాస్ అబూ అక్రమ్ అనే టాప్ కమాండర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో చనిపోయిన అబూ అక్రమ్‌కు గతంలో పోలీసులను చంపిన కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

సౌత్ కశ్మీర్‌లోని జానిపొరా గ్రామంలో 2018లో నలుగురు పోలీసులను టెర్రరిస్టులు చంపారు. ఈ కేసుతోపాటు 2019లో చిత్రిగామ్‌లో ఇద్దరు నాన్ లోకల్ డ్రైవర్లను చంపిన ఘటనలోనూ అబూ అక్రమ్‌కు ప్రధాన హస్తం ఉందని పోలీసులు తెలిపారు. ‘భద్రతా దళాలు, పోలీసులతోపాటు సాధారణ ప్రజలపై పక్కా ప్లాన్‌తో దాడులు చేయడంలో అబూ అక్రమ్ సిద్ధహస్తుడు. యువతను తప్పుదోవ పట్టించి టెర్రరిస్టులతో చేతులు కలిపేలా చేయడంలో అతడు నేర్పరి. జొనిపొరాలో పోలీసులను చంపిన ఘటనలో అతడి హస్తం ఉంది’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.