- తెలంగాణ ఎస్ఐబీ పోలీసుల ఎదుట లొంగుబాటు
- నేడో, రేపో అధికారిక ప్రకటన
- బడే చొక్కారావు కోసం పోలీసుల వేట
- చివరిదశకొచ్చిన మావోయిస్టు ఉద్యమం
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు పార్టీకి అతి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి రాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌తో పాటు 16 మంది మావోయిస్టులతో కలిసి దేవ్‌జీ ఎస్ఐబీ పోలీసులకు సరెండర్ అయ్యారు. అసిఫాబాద్ జిల్లా అడవుల్లో రాష్ట్ర పోలీసులు చేపట్టిన కీలక ఆపరేషన్ విజయవంతమైంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. ఇయ్యాల్నో.. రేపో హైదరాబాద్ డీజీపీ ఆఫీస్‌లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లొంగుబాట్లతో దేశంలోనే మావోయిస్టు ఉద్యమం చివరిదశకు వచ్చినట్టు భావిస్తున్నారు. దశాబ్దాలుగా అడవుల్లో ఉండి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించి అనేక పోరాటాలు చేసి పార్టీలోనే అతి పెద్ద హోదాలో పనిచేసిన నంబాల కేశవరావు, హిడ్మా వంటి కీలకమైన లీడర్లు ఎన్కౌంటర్లో మరణించగా మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి లీడర్లు పోలీసులకు లొంగిపోయారు. తాజాగా దేవ్‌జీ, సంగ్రామ్ లాంటి లీడర్ల లొంగుబాట్లతో మావోయిస్టు ఉద్యమం తుడిచిపెట్టుకుపోయినట్టేనని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఓ వైపు వరుస ఎన్కౌంటర్లు.. మరో వైపు లొంగుబాట్లతో మావోయిస్టుల క్యాడర్ పూర్తిగా తగ్గిపోతున్నది. 2024 నాటికి 38 జిల్లాలలో ఉన్న ఉద్యమం కాస్త ‘ఆపరేషన్ కగార్’తో గడిచిన రెండేళ్లలోనే తుది దశకొచ్చింది. తాజాగా మావోయిస్ట్ పార్టీ చీఫ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌తో పాటు 16 మంది మావోయిస్టులు ఆదివారం అసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) పోలీసులకు లొంగిపోయారు. అందరూ కూడా తాము ధరించే ఆయుధాలతో లొంగిపోయినట్లుగా ప్రచారం జరుగుతున్నది.
తిప్పిరి తిరుపతి @ దేవ్ జీ
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్‌జీ మావోయిస్టు పార్టీలో చేరి 40 ఏండ్లు దాటింది. వెంకట నరసయ్య,-గంగుబాయి దంపతుల మొదటి సంతానం తిరుపతి. ఇతడికి ఇద్దరు సోదరులు, ఒక అక్క ఉన్నారు. తిరుపతి పేరు ఎన్ఐఏ హిట్‌లిస్ట్‌లో ఉంది. దేశంలోనే రూ.3.6 కోట్ల అత్యధిక రివార్డ్ కలిగిన మావోయిస్టు లీడర్. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తిరుపతి ప్రస్తుతం పార్టీ సెంట్రల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2025 మే 21న నంబాల కేశవ రావు అలియాస్ బస్వరాజ్ మరణం తర్వాత, సెప్టెంబర్ 2025లో బస్తర్ మీటింగ్‌లో పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఈ పదవి చేపట్టిన మొదటి దళిత నాయకుడు ఈయనే. మిలిటరీ వ్యూహాలు పన్ని దాడులు చేయడంలో దిట్ట. మిలిటరీ స్ట్రాటజిస్ట్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) సృష్టికర్త. ఆర్ఎస్యూ ద్వారా నక్సల్ ఉద్యమంలో ప్రభావితుడై, 1982లో సుమారు 19 ఏండ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీ పత్రిక "అవమి జంగ్" లో ఆర్టికల్స్ రాసి మావోయిస్ట్ విజయాలను ప్రచారం చేశారు. మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌మెంట్, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. 2010 ఏప్రిల్‌లో చత్తీస్‌గఢ్ దంతెవాడ దాడికి మాస్టర్‌మైండ్ ఈయనే. ఒకే సారి 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అలిపిరిలో ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబుపై ఆనాడు జరిగిన బాంబుదాడి ఘటనలో దేవ్‌జీ హస్తం ఉందని చెబుతారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్‌జీ తమ్ముడు గంగాధర్ కూతురు సుమ భయాందోళనకు గురై ‘పెద్ద నాన్న లొంగిపోవాలని.. క్షేమంగా ఇంటికి రావాలని కోరుతూ కన్నీటితో రాసిన లేఖ’ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల జరిగిన పరిణామాలతో దేవ్‌జీ దండకారణ్యం వదిలి పోలీసు భద్రతా బలగాల ముందు లొంగిపోయారు.
మల్లా రాజిరెడ్డి @ సంగ్రామ్
మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ది పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి. తల్లితండ్రులు మల్ల రాధమ్మ, వెంకట్‌రెడ్డి కాగా సోదరుడు భీమారెడ్డి. ఈయన 50 ఏండ్ల కిందటే 1975 లో మంథని జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ పీపుల్స్ పార్టీలో చేరారు. ముందుగా ఈ పార్టీకి అనుబంధంగా ఉన్న రాడికల్స్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్యూ)లో చురుకుగా పనిచేశారు. మావోయిస్టు పార్టీ తొలితరం నేతలలో ఈయన ఒకరు. పార్టీలో పనిచేస్తున్న సమయంలోనే అక్కడే పరిచయం అయిన రత్తమ్మను వివాహం చేసుకోగా వీరికి కూతరు స్వర్ణలత జన్మించింది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. రాజిరెడ్డి ధర్మపురిలో ఒకసారి, 2007 లో కేరళలో మరోసారి అరెస్టు అయి జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత మళ్లీ పార్టీ లోనే చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈయన గత 50 ఏళ్లుగా పార్టీ విస్తరణ కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు. మిలిటరీ యాక్షన్ వ్యూహకర్తగా కూడా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ స్పీకర్ శ్రీపాద రావు హత్యలో ఈయన పాత్ర ఉందని, 42 కేసులలో పాల్గొన్నారన్న ఆరోపణలున్నాయి. వివిధ రాష్ట్రాల్లో రాజిరెడ్డిపై రూ. కోటి పైగా రివార్డు ఉన్నది. వృద్ధాప్యం కారణంగా అసిఫాబాద్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయారని అంటున్నారు.
2025లో భారీగా తగిలిన ఎదురుదెబ్బలు
మావోయిస్టులకు 2025 లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. మే నెలలో నారాయణపూర్,- బీజాపూర్, -దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. నవంబర్ 18న ఆంధ్రలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో పీఎల్జీఏ ఆపరేషన్ బెటాలియన్ చీఫ్ మడవి హిడ్మా హతమయ్యారు. హిడ్మా భార్యతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. వివిధ రాష్ట్రాలలో 450 మందికి పైగా మావోలు ఎన్కౌంటర్లో చనిపోతే ఐదుగురు సెంట్రల్ కమిటీ, ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్లతో సహా 820 మంది మావోలు లొంగిపోయారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేసిన తర్వాత మావోయిస్టు పార్టీని తుదముట్టించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నది. భద్రత ఖర్చుల (ఎస్ఆర్ఈ) స్కీమ్ కింద రూ.3,260 కోట్లు, ప్రత్యేక కేంద్ర సహాయం(ఎస్సీఏ) స్కీమ్ ద్వారా రూ.3,563 కోట్లు, ప్రత్యేక మౌలిక వసతుల (ఎస్ ఐఎస్) పథకం ద్వారా రూ.1,741 కోట్లు కేటాయించింది.
బడే చొక్కారావు కోసం పోలీసుల వేట
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం రాష్ట్ర పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న లీడర్లలో ఈయన ఒక్కరే ఉన్నారు. తాజాగా ఆ పార్టీ చీఫ్ దేవ్‌జీ, సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి లొంగుబాటుతో దాదాపుగా మావోయిస్టు ఉద్యమం తుది దశకు వచ్చేసినట్లయింది. అయితే గత ముప్పై ఏండ్లుగా ఉద్యమంలో పనిచేస్తూ ఎన్ఐఏ హిట్‌లిస్ట్‌లో పేరున్న చొక్కారావు ఇంకా పోలీసు బలగాలకు దొరకడం లేదు. ఈయనపై అన్నీ రాష్ట్రాలలో కలిపి రూ.2 కోట్ల రివార్టు ఉంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మిలిటరీ వ్యూహాలు పన్నడంలో, దాడులు చేయడంలో, కొత్త సభ్యుల రిక్రూట్‌మెంట్‌లో నైపుణ్యం సాధించి రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు, అటాక్ గ్రూపులకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి దామోదర్ చనిపోయినట్లుగా వార్తలు రావడం.. ఆ తర్వాత తప్పించుకున్నారని ప్రకటనలు వస్తున్నాయి. ఇలా పది, పదిహేను సార్లు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. దీంతో చొక్కారావుపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి వేట కొనసాగిస్తున్నారు.
చివరిదశకొచ్చిన మావోయిస్టు ఉద్యమం
1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీలో మొదలైన నక్సలిజం ఆ తర్వాత దేశ మంతటా వ్యాపించి ఇప్పుడు ఆరు దశాబ్దాల తర్వాత చివరి దశకొచ్చేసింది. దశాబ్దాల పోరాటంలో నక్సలిజం అనేక రూపాలుగా మారి చివరికి మావోయిస్టు పేరుతో స్థిరపడింది. అనేక రాష్ట్రాలలో విస్తరించి దండకారణ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా జనతన సర్కార్ నిర్వహించిన మావోయిస్టులు ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటికొచ్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2009లో ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరిట మావోయిస్టుల విస్తరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం స్టార్ట్ చేసింది. అప్పటినుంచి దేశ వ్యాప్తంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నది. ఈ మధ్య వేలాది మంది పోలీసులతో ఇంకా నిర్భంధం పెంచింది. దేశంలో ఈ ఏడాది మార్చి 31నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2024 జనవరి నుంచి ‘ఆపరేషన్ కగార్’ స్టార్ట్ చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిషా, జార్ఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్డీ, సీ-60, ఎస్‌వోజీ పేరుతో వేలాది మంది పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. హెలీకాఫ్టర్లు, డ్రోన్లు, భారీ వెహికిల్స్ సహాయంతో ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
