టెక్సస్​లో టోర్నడో బీభత్సం

టెక్సస్​లో టోర్నడో బీభత్సం
  • ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
  • ఇండ్లు, వాహనాలు ధ్వంసం

పెర్రీటన్: అమెరికాలోని టెక్సస్​ రాష్ట్రాన్ని టోర్నడో మరోసారి వణికించింది. పెర్రీటన్​లో గురువారం సంభవించిన టోర్నడో ధాటికి ముగ్గురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఇండ్లు, 30 వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి. టెక్సస్​తో పాటు పొరుగు రాష్ట్రం ఒక్లహామాలో కరెంట్  సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో 50 వేల మంది రాత్రంతా చీకట్లోనే గడిపారు. ఇండ్ల శిథిలాల కింద ఉన్నవారిని ఫైర్ ఫైటర్లు వెలికితీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. టోర్నడో వల్ల గాయపడిన వారితో తమ హాస్పిటల్  నిండిపోయిందని ఒకిల్ ట్రీ కౌంటీ ఎక్స్ పో సెంటర్  సీఈవో కెల్లీ జుడిస్  తెలిపారు. పది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆమె చెప్పారు.

ముప్పు పొంచి ఉంది

టెక్సస్ తో పాటు ఫ్లోరిడా, ఇతర సదరన్  స్టేట్స్ కు టోర్నడో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే హీట్ వేవ్స్  ముప్పు కూడా ఉందని, టెంపరేచర్ల 43 డిగ్రీల సెల్సియస్  వరకు రికార్డు కావచ్చని పేర్కొన్నారు. కాగా, రెండు రోజుల వ్యవధిలోనే టెక్సస్ లో రెండో టోర్నడో వచ్చింది. బుధవారం టెక్సస్, జార్జియాను భీకరమైన టోర్నడో వణికించింది. దాని ప్రభావానికి చెట్లు కూలిపోయాయి. బిల్డింగులు ధ్వంసమయ్యాయి. కార్లు ఎగిరిపోయాయి.