అమెరికాలో మళ్లీ టోర్నడోల పంజా

అమెరికాలో మళ్లీ టోర్నడోల పంజా

వాషింగ్టన్: అమెరికాలో టోర్నడోలు మళ్లీ బీభత్సం సృష్టించాయి. అర్కన్సా, ఇలినాయి రాష్ట్రాల్లో టోర్నడోల దెబ్బకు ఏడుగురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇండ్లు, థియేటర్ల రూఫ్​లు టోర్నడో ధాటికి గాల్లో ఎగిరిపోయాయి. ఇలినాయి స్టేట్​లోని సల్లివాన్  కౌంటీలో ముగ్గురు చనిపోయారని ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్  అధికారులు తెలిపారు. ఈ కౌంటీలో తుఫాను దెబ్బకు పలు ఇండ్లు డ్యామేజ్  అయ్యాయి. కొంత మంది స్థానికులు గల్లంతయ్యారు. అలాగే లిటిల్ రాక్ ఏరియాలో ఒకరు చనిపోయారు. 

24 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెల్విడేర్ లో ఓ థియేటర్  రూఫ్  కూలిపోయి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయపడ్డారు. అర్కన్సా స్టేట్​లోని విన్  పట్టణంలో కూడా టోర్నడో బీభత్సం సృష్టించింది. దాని తీవ్రతకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. వాటి శిథిలాల్లో చిక్కుకొని పలువురు స్థానికులు గాయపడ్డారు. ఈ టౌన్ లో ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు. ఇలినాయిలోని లిటిల్ రాక్  నుంచి పొరుగున ఉన్న ప్రాంతానికి టోర్నడో వ్యాపించింది. 

అనంతరం అర్కన్సా స్టేట్ లోని పలు సిటీల్లో  ప్రవేశించి ఇండ్లు, వాహనాలను ధ్వంసం చేసింది. క్లింటన్  నేషనల్  ఎయిర్ పోర్టులో ప్రయాణికులు బాత్ రూంల్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. మేంఫిస్, టెన్నెసీ, విన్ పట్టణంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని చెప్పారు. దీంతో ఈ స్టేట్​లో ఎమర్జెన్సీ ప్రకటించామని గవర్నర్  సారా సాండర్స్  తెలిపారు. తుఫాను సృష్టించిన బీభత్సంపై అధికారులతో ఆమె ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా, వారం క్రితమే మిసిసిపి స్టేట్​లో టోర్నడో సంభవించి 25 మరణించారు.