అమెరికాలో టోర్నడోల బీభత్సం

అమెరికాలో టోర్నడోల బీభత్సం

లూయిన్: అమెరికాలోని మిసిసిప్పీ రాష్ట్రంలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన టోర్నడోలతో పాటు వడగండ్ల వానకు రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ ఇండ్లు, చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. జస్పెర్ కౌంటీలో ఒకరు చనిపోగా, దాదాపు 20 మందికి గాయాలయ్యాయని అధికారులు సోమవారం తెలిపారు. చాలా కౌంటీల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. లూయిన్ టౌన్ లో భారీ నష్టం జరిగిందని.. ఇండ్లు, చెట్లు కూలిపోయి మొత్తం శిథిలాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రోడ్లపై కరెంట్ స్తంభాలు పడడంతో కొన్ని కౌంటీలకు వెళ్లేందుకు వీలు కావడం లేదన్నారు. సెంట్రల్ మిసిసిప్పీలోని దాదాపు 49 వేల ఇండ్లకు కరెంట్ కట్ అయిందని మిసిసిప్పీ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తెలిపింది. మిసిసిప్పీ రాజధాని జాక్సన్ దగ్గర్లోని రాంకిన్ కౌంటీ కూడా చాలావరకు డ్యామేజ్ అయిందని గవర్నర్ టేట్ రీవ్స్ చెప్పారు. 

అర్ధరాత్రి సడెన్ గా.. 

‘‘అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. లేచి చూసే సరికి టోర్నడో కనిపించింది. వెంటనే షెల్టర్ లోకి వెళ్లాను. సాయం కోసం వీధిలో చాలా మంది అరిచారు. మా వీధిలోనే ఉండే నా కజిన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె చనిపోయింది” అని జస్పెర్ కౌంటీకి చెందిన లెస్టర్ క్యాంప్ బెల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.