- ఇప్పటికే ఆశలు పెట్టుకున్న మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ
- ఆశావహుల్లో ఎర్రం మహేశ్,ప్రతాప రామకృష్ణ
కరీంనగర్, వెలుగు: వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే టికెట్‌కు తీవ్ర పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తారని కొన్నాళ్లు ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడది మరుగున పడింది. ఇన్నాళ్లు వేములవాడ టికెట్ కోసం ఒకరిద్దరు మాత్రమే సీరియస్‌గా ట్రై చేస్తుండగా.. ఇప్పుడీ పోటీలో మరొకరు వచ్చి చేరారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తూ మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కొడుకు, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ వికాస్ రావు బీజేపీలోకి వచ్చారు. ఇదే నియోజకవర్గంపై మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరితో పాటు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు, గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రతాప రామకృష్ణతో పాటు రాష్ట్ర నాయకుడు ఎర్రం మహేశ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే టికెట్ విషయంలో ప్రస్తుతం తుల ఉమ, వికాస్ రావు మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరివైపు హైకమాండ్ మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తండ్రి అండతో వికాస్..
రాష్ట్ర రాజకీయాల్లో చెన్నమనేని ఫ్యామిలీది ప్రముఖ పాత్ర. చెన్నమనేని రాజేశ్వర్ రావు తెలంగాణ సాయుధ పోరాట నేతగా, కమ్యూనిస్టు పార్టీ లీడర్ గా.. ఆయన తమ్ముడు విద్యాసాగర్ రావు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పదవులు చేపట్టారు. చెన్నమనేని రాజేశ్వర్ రావు కొడుకు రమేశ్‌బాబు ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఈసారి ఆయనకు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఇదే ఫ్యామిలీ నుంచి విద్యాసాగర్ రావు రాజకీయ వారసుడిగా ఇప్పుడు డాక్టర్ వికాస్ రావు ఎంట్రీ ఇచ్చారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన పాలిటిక్స్ లోకి రావడానికి మూడేండ్ల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేశారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యేందుకు తన భార్య దీపతో కలిసి ప్రతిమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం, మహిళలకు కుట్టు మిషన్లు, యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయడం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీతో విద్యాసాగర్ రావు భేటీ కావడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి టికెట్ విషయంలో హామీ తీసుకున్నాకే వికాస్ రావు బీజేపీలో చేరారని ప్రచారం జరుగుతోంది. బీజేపీకి విద్యాసాగర్ రావు అందించిన సేవలు, ఆయనకు పార్టీ అగ్ర నేతలతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా వికాస్ రావుకే టికెట్ వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
టికెట్‌పై ధీమాతో ఉమ..
కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ బీఆర్ఎస్ను వీడి.. ఈటల రాజేందర్ తో కలిసి రెండేండ్ల కింద బీజేపీలో చేరారు. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ జడ్పీటీసీగా గెలుపొందిన ఆమె.. జడ్పీ చైర్ పర్సన్ గా పని చేశారు. ఈ నేపథ్యంలోనే వేములవాడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మద్దతుతో టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇన్నాళ్లు ఆమెకు పెద్దగా పోటీ లేనప్పటికీ, ఇప్పుడు వికాస్ రావు చేరికతో పోటీ నెలకొంది.
