- మల్లన్న దేవుని పేరిట నమోదు కాని ల్యాండ్
- సరిహద్దు సమస్యతో పట్టాల జారీలో జాప్యం
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కొమురవెల్లి మల్లన్న భూముల రక్షణను ప్రశ్నార్థకం చేస్తోంది. కొమురవెల్లి మల్లన్నకు సమీప గ్రామాల్లో 166.09 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి సరైన హద్దులు గుర్తించకపోవడంతో పాటు దేవాదాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా మల్లన్న దేవుడి పేరిట పట్టాలు కాలేదు. మల్లన్న దేవుడి భూములకు సంబంధించిన సర్వే నంబర్లు పెద్దవి కావడంతో వాటి హద్దులు గుర్తించే విషయంలో జాప్యం జరుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మల్లన్న భూములు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్య ఇలాగే ఉండగా, అభివృద్ది పనులకు సైతం ఆలయ భూములను కేటాయిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం 166.09 ఎకరాల్లో 31.9 ఎకరాలు దేవుని పేరిట పట్టా అయ్యాయి. మిగిలిన 130 ఎకరాలను మల్లన్న దేవుని పేరిట పట్టా చేసి పాస్ బుక్కులు జారీ చేయాలని అప్పటి ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ఆలయాలకు సంబంధించిన భూములు ధరణిలో నమోదు చేసి పట్టాలు జారీ చేసినా కొమురవెల్లిలో మాత్రం దేవాదాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఇప్పటికీ పట్టాలకు నోచుకోలేదు.
హద్దుల సమస్యనే ప్రధాన కారణం..
కోట్ల రూపాయల విలువైన కొమురవెల్లి మల్లికార్జున స్వామికి చెందిన ఆలయ భూములకు హద్దులను గుర్తించకపోవడంతో పట్టాల జారీలో జాప్యం జరుగుతోంది. మల్లన్న పేరిట భూములను రికార్డుల్లో నమోదు చేసిన రెవెన్యూ అధికారులు, వాటికి సంబంధించిన హద్దులు నిర్ణయించి, పట్టాలు ఆలయ అధికారులకు ఇవ్వడం లేదు. మల్లన్న ఆలయానికి ఐదు గ్రామాల పరిధిలో 161.09 ఎకరాల భూములున్నాయి. కొమురవెల్లిలో 76.28, కిష్టంపేటలో 27.16, రాంసాగర్ లో 11.01 , గౌరాయపల్లిలో 6 , వేచరేణిలో 10.04 ఎకరాలు మల్లన్న దేవుని పేరిట పట్టాలు జారీ కావాల్సి ఉంది.
హద్దు సమస్య తేల్చట్లే..
మల్లన్న ఆలయానికి పెద్ద ఎత్తున భూములన్నా వాటి హద్దుల విషయంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆలయ భూముల ఉన్న సర్వే నంబర్లు పెద్దవి కావడంతో వీటి హద్దుల విషయంలో వివాదాలు ఏర్పడుతున్నాయి. గతంలో ఈ భూములను సర్వే చేసి ధరణిలో నమోదు చేసినా పట్టాలు జారీ చేయలేదు. హద్దులు గుర్తించే సమయంలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి సమస్యలు ఎదురవుతుండడంతో ఆలయ అధికారులు ఊరుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మల్లన్న ఆలయ భూములుగా పేర్కొంటూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించగా, మరికొన్ని చోట్ల హద్దు రాళ్లను తొలగిస్తున్నారు.
ప్రజా అవసరాలకు కేటాయింపు..
మల్లన్న దేవుడి భూములకు పట్టాలు జారీ కాకపోవడంతో ప్రజా అవసరాల కోసం భూములను కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఒక ఎకరంలో పోలీస్స్టేషన్, పాత కమాన్ వద్ద కేజీబీవీకి మూడెకరాలు కేటాయించారు. విలువైన భూముల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా, వాటిని కూల్చివేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. హద్దుల గుర్తింపు కాకపోవడంతో ఆలయ భూములపై కబ్జాదారుల కన్ను పడుతోంది. రాజీవ్ రహదారి సమీపంలోని విలువైన భూముల్లో కొందరు నిర్మాణాలకు యత్నించారు. కొన్ని చోట్ల చదును చేసుకొని ఆక్రమించే ప్రయత్నం చేయగా అధికారులు అడ్దుకున్నారు. ఇక కొన్ని చోట్ల ఆలయ భూముల్లో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నా అక్రమార్కులు ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు.
పట్టాల జారీ జరుగుతోంది..
కొమురవెల్లి మల్లన్న పేరిట పట్టాల జారీ ప్రక్రియ జరుగుతోంది. ఆలయానికి 131 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదైనప్పటికీ, పట్టాలు జారీ కాలేదు. హద్దుల సమస్య వల్ల పట్టాల జారీలో కొంత జాప్యం జరుగుతోంది. ఈ విషయంపై అధికారులతో మాట్లడుతున్నాం. హద్దులు గుర్తించి పట్టాలు జారీ కాగానే, వాటికి కంచెలు ఏర్పాటు చేసి భూముల రక్షణకు చర్యలు చేపడతాం.– కృష్ణ ప్రసాద్, ఈవో
