హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ)లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్కార్పొరేషన్కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ (టీటీడీసీసీఓఈ) యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమిని యూనియన్ అధ్యక్షుడు వీఎస్. బోస్, ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి కలిసి వినతి పత్రం అందజేశారు.
గతేడాది నవంబర్ 25న స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వేతనాల పెంపు, వయోపరిమితి పెంపు, గ్రాట్యుటీ తదితర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా యూనియన్ నేతలు గుర్తు చేశారు. 2026 ఫిబ్రవరి నుంచి పెంచిన వేతనాలను అమలు చేస్తున్నప్పటికీ.. అదే సమయంలో కార్మికులు ఎంతో కష్టపడి సాధించుకున్న ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్‌లను యాజమాన్యం నిలిపివేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల తర్వాత వచ్చిన ఈ అలవెన్సులను కట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ కార్మికుల వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచుతూ యాజమాన్యం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
