మా దగ్గర కూడా ఏసీబీ, సీఐడీలు ఉన్నాయి : మంత్రి శ్రీనివాస్​ గౌడ్

మా దగ్గర కూడా ఏసీబీ, సీఐడీలు ఉన్నాయి : మంత్రి శ్రీనివాస్​ గౌడ్

మహబూబ్​నగర్, వెలుగు: కేంద్రం చేస్తున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడబోమని, ప్రతి దాడులకు సిద్ధంగా ఉన్నామని టూరిజం మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. బుధవారం మహబూబ్​నగర్​లో మంత్రి నిరంజన్​రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంపై చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా దాడులు చేసుడేందని, ఇదెక్కడి సంస్కృతని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థలుగా మార్చుకొని రాష్ట్రంపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై కుట్రలు, మంత్రి గంగులపై ఈడీ దాడులు, మరో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులతో అరాచకాలకు పాల్పడుతోందని ఫైర్​ అయ్యారు. దేశంలో ఎక్కడా లేనట్లు తెలంగాణలో మాత్రమే తప్పులు జరుగుతున్నట్లు కేంద్రం ప్రవర్తిస్తోందని, తెలంగాణ గొంతు నొక్కి అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎవిడెన్సులున్నయ్

టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన కేసులో అన్ని ఆధారాలున్నాయని, దీనిపై విచారణ జరుగుతోందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. దేశ వ్యాప్తంగా కొత్త మెడికల్​ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. కానీ, మెడికల్ కాలేజీలతో సేవ చేస్తున్న మల్లారెడ్డిపై కేంద్రం దాడులు చేస్తోందన్నారు.  కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్​ దృష్టి అభివృద్ధిపైనే ఉంటుందని చెప్పారు. తమ వద్ద కూడా ఏసీబీ, సీఐడీ లాంటి ఎన్నో సంస్థలున్నా.. దాడుల కల్చర్​కు ఏనాడూ పోలేదన్నారు. మహబూబ్​నగర్​లో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అని చెప్పిన ప్రధాని మోడీ హామీకి ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. డిసెంబరు 4న పాలమూరు నూతన కలెక్టరేట్ ఓపెనింగ్​కు సీఎం కేసీఆర్ వస్తారని మంత్రి చెప్పారు.