డెత్ వ్యాలీ@ 53 డిగ్రీలు.. అమెరికాలో రికార్డు టెంపరేచర్లు

డెత్ వ్యాలీ@ 53 డిగ్రీలు.. అమెరికాలో రికార్డు టెంపరేచర్లు

కాలిఫోర్నియా: అమెరికాలో ఈస్టర్న్  కాలిఫోర్నియాలోని డెత్  వ్యాలీలో రికార్డు స్థాయిలో 53 డిగ్రీల సెల్సియస్  టెంపరేచర్​ నమోదైంది. అయినా కూడా పర్యాటకులు టెంపరేచర్ ను లెక్కచేయకుండా డెత్  వ్యాలీకి వెళ్లి వేడి వాతావరణాన్ని ఆస్వాదించారు. గత కొద్ది రోజులుగా డెత్ వ్యాలీలోని ఫర్నేస్  క్రీక్ లో టెంపరేచర్లు 50 డిగ్రీల సెల్సియస్ పైనే రికార్డవుతున్నాయి. ఆదివారం ఇక్కడ 53.33 డిగ్రీల సెల్సియస్  టెంపరేచర్  నమోదైంది. దీంతో వేడి వాతావరణాన్ని ఎంజాయ్  చేసేందుకు పర్యాటకులు ఫర్నేస్  క్రీక్ లోని నేషనల్  పార్కుకు భారీగా తరలివెళ్లారు. అక్కడ డిజిటల్  థర్మామీటర్లతో సెల్ఫీలు తీసుకున్నారు. ఉదయం పది తర్వాత పార్కు ఏరియాలో తిరగవద్దని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా టూరిస్టులు పట్టించుకోలేదు. అధికారుల సూచనలను పక్కనపెట్టి మరీ హీట్ ను ఎంజాయ్  చేశారు. వేడి వాతావరణాన్ని బాగా ఆస్వాదించామని పలువురు పర్యాటకులు తెలిపారు. వేడి తమ ఎముకల్లో చేరిన అనుభూతి కలిగిందని, వేడి గాలుల వల్ల కళ్లు పొడిబారిపోయాయని చెప్పారు. 

‘‘డెత్  వ్యాలీలో టెంపరేచర్లు పెరగడం చారిత్రాత్మక ఘట్టం. అటువంటి అవకాశం వచ్చినపుడు సద్వినియోగం చేసుకోవాలి. అందుకే హీట్  టెంపరేచర్ ను ఎంజాయ్  చేసేందుకు డెత్  వ్యాలీకి వచ్చాను” అని ఓ సందర్శకుడు తెలిపాడు. కాగా, ఫర్నేస్  క్రీక్ లో 1913 జులైలో అత్యంత ఎక్కువగా 56.66 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక అమెరికాలో సోమవారం పది కోట్ల మందికి హీట్ వేవ్  అలర్ట్  జారీ చేశారు. నైరుతి అమెరికా అంతా హీట్ వేవ్ లు కొనసాగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ‘‘ప్రజలు ఇంట్లో ఏసీ ఆన్  చేసుకుని ఉండాలి. శరీరంలో నీళ్లు తగ్గకుండా ఎప్పటికపుడు బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. పిల్లలను, పెంపుడు జంతువులను కార్లలో లాక్  చేసి ఉంచొద్దు. టెంపరేచర్లు ప్రమాదకర స్థాయిని చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలినంత హైడ్రేషన్ లేకపోతే ప్రాణాలకే ప్రమాదం” అని నేషనల్  వెదర్  సర్వీస్ అధికారులు హెచ్చరించారు. అయితే, ఇది ఆరంభం మాత్రమే అని వారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల ఫలితమే టెంపరేచర్ల పెరుగుదలకు కారణమని చెప్పారు. విధానాలను మార్చుకోకుండా ఇలాగే  కొనసాగితే 2100 లోపు టెంపరేచర్లు 2.7 డిగ్రీల సెల్సియస్  పెరుగుతాయని యూనివర్సిటీ కాలేజ్  లండన్ లో గ్లోబల్  చేంజ్  సైన్స్  హెడ్, ప్రొఫెసర్   సైమన్  లెవిస్  తెలిపారు.

యూరప్​లో చల్లని ప్రాంతాలకు టూరిస్టులు.. 


యూరప్​లో పర్యాటకులు ఎప్పట్లాగే కూలింగ్   డెస్టినేనషన్లకు క్యూ కట్టారు. దక్షిణ యూరప్  దేశాల్లో హీట్ వేవ్స్ కారణంగా జనం చల్లని ప్రాంతాలకు తరలివెళుతున్నారు. చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఐర్లాండ్, బల్గేరియా వంటి దేశాలకు పర్యాటకులు ఎక్కువగా వెళుతున్నారు. వేడి గాలులు కొనసాగే అవకాశం ఉండడంతో వచ్చే రోజుల్లో ఈ దేశాలకు టూరిస్టుల సంఖ్య మరింత పెరిగే చాన్స్  ఉందని ఈటీసీ హెడ్  మిగుయెల్  సాంజ్  పేర్కొన్నారు. సాధారణంగా జూన్  నుంచి నవంబర్ మధ్యలో మధ్యదరా సముద్రానికి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ సీజన్ లో హీట్  వేవ్స్ కారణంగా ఆ సంఖ్య నిరుటితో  పోలిస్తే 10% తగ్గిందని యూరోపియన్  ట్రావెల్  కమిషన్(ఈటీసీ) తెలిపింది.

వచ్చే వారం యూరప్​లో.. 

ఇప్పటికే తీవ్ర వడగాడ్పులతో కుతకుతలాడు తున్న యూరప్  దేశాలకు వచ్చే వారం మరింత ముప్పు పొంచి ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇంకా దిగజారవచ్చని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సైంటిస్టులు సూచిస్తున్నారు.