సీఎం కారుపై ఏడు పెండింగ్ ఛలాన్లు.. 50 శాతం డిస్కౌంట్ స్కీంలో కట్టేశారు !

సీఎం కారుపై ఏడు పెండింగ్ ఛలాన్లు.. 50 శాతం డిస్కౌంట్ స్కీంలో కట్టేశారు !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వినియోగిస్తు్న్న టయోటా ఫార్చ్యునర్ కారుపై 7 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ 7 ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల్లో ఆరు కేసులు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫ్రంట్ సీటులో కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకోనివే కావడం గమనార్హం. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాల్లో సీఎం కారు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లు రికార్డయింది. 

2024 జనవరి నుంచి ఈ 7 కేసులు నమోదు కాగా.. సీఎం సిద్ధరామయ్య తాజాగా జరిమానా చెల్లించారు. ప్రస్తుతం కర్ణాటకలో ట్రాఫిక్ ఛలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్ను వినియోగించుకుని సీఎం సిద్ధరామయ్య తన టయోటా ఫార్చ్యునర్ కారుపై ఉన్న పెండింగ్ ఛలాన్లను చెల్లించడం విశేషం. 50 శాతం డిస్కౌంట్ పోగా.. 2 వేల 5 వందల జరిమానాను సీఎం చెల్లించారు.

సెప్టెంబర్ 12 తర్వాత కర్ణాటకలో పెండింగ్ ఛలాన్లపై ఈ 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ముగిసిపోతుంది. ఒక్క 2024 సంవత్సరంలోనే బెంగళూరు సిటీలో మొత్తం 80 లక్షలకు పైగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు నమోదు కావడం గమనార్హం. సిగ్నల్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదైనట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

►ALSO READ | జైన గురువు రూపంలో వచ్చి.. వజ్రాలు, రత్నాలు పొదిగిన కోటి రూపాయల కలశం నొక్కేశాడు

ఈ 80 లక్షల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసుల్లో 50 లక్షల కేసులు ద్విచక్ర వాహనదారులవే కావడం గమనార్హం. 2023లో కూడా పెండింగ్ ఛలాన్లపై కర్ణాటకలో 50 శాతం డిస్కౌంట్ను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో ఈ డిస్కౌంట్ ప్రకటించాక 5.6 కోట్ల రూపాయల డబ్బు ఛలాన్ల రూపంలో ప్రభుత్వానికి దక్కింది. ఈసారి కూడా ప్రభుత్వం ఆశించిన రీతిలోనే వాహనదారులు పెండింగ్ ఛలాన్లను కట్టి ఛలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు.